పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలి

– తుఫాన్‌ ప్రభావిత మహబూబాబాద్‌, ములుగు కలెక్టర్లకు సూచనలు
– మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్‌, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు తమ పశువులు, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. పలుచోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో వాటిల్లోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని మంత్రి సీతక్క కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *