గవర్నర్, ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేషమైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై నేడు ఏడు విభాగాలలో 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో బిక్నూరు, సారంగపూర్ క్యాంపస్‌లు సహా ఇక్కడ ప్రధాన క్యాంపస్‌లో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇక్కడి అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధకుల ఉమ్మడి కృషి అంకితభావం ప్రతిబింబిస్తోందన్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లు కేవలం విద్యాపరమైన లక్ష్యసాధనకు మాత్రమే కాదని విశ్వవిద్యాలాయంలో నాణ్యమైన, సాంకేతిక విద్య, ఉపాధి కల్పించే భవిష్యత్ ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుందని గవర్నర్ అన్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ఈ విశ్వవిద్యాలయం అనేకమైన, ఆశాజనకమైనటువంటి పారిశ్రామిక, విద్యాపరమైన సంబంధాలతో ముందుకుపోవడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవుని తయారు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చరిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడం అని పేర్కొన్నారు. కొఠారి కమిషన్‌లో చెప్పినట్లు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందనేది విశ్వవిద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయన్నారు. ముఖ్య అతిథిగా భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నుండి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికీ అవకాశాలు కనిపిస్తాయన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాల వైపు పరిగెత్తాలని సూచించారు. వర్తమాన కాలంలో అనేక అవకాశాలతో విద్యార్థులు తమ నైపుణ్యాలను, కౌశల్యాలను, అభిరుచులను ఉపయోగించుకొని అనేక రకాలుగా స్థిరపడే అవకాశం ఉందన్నారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న కోర్సుల వివరాలతోపాటు అవస్థాపన సౌకర్యాలను సమగ్రంగా తెలియజేశారు. విశ్వవిద్యాలయంలో సమీప భవిష్యత్తులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిపాలనా భవనం, 500మంది విద్యార్థినులకు అన్ని వసతులు ఉండే విధమైన బాలికల హాస్టల్‌ను, వెయ్యిమంది సామర్థ్యంతో ఆడిటోరియం, అన్ని హంగులతో క్రీడా మైదానం అభివృద్ధి వంటి భవిష్యత్ ప్రణాళికలను తెలియజేశారు. విశ్వవిద్యాలయ పరిధిని నిజామాబాదు, కామారెడ్డి నుండి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, స్నాతకోత్సవంలో 15 విభాగాలలో 2014 నుండి 2023 వరకు 132మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 156మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు ఇచ్చారు. రెండవ స్నాకోత్సవం విజయవంతమైందని యాదగిరిరావు తెలిపారు. స్నాతకోత్సవంలో డీన్స్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ నాగరాజు, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధిని, ఫ్రొఫెసర్ అరుణ ప్రొఫెసర్ నాగరాజు పాత, పిఆర్వో డైరెక్టర్ డాక్టరు ఎ.పున్నయ్యలతోపాటు బోధన బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు. అతిథులుగా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్సలర్ విష్ణుదేవ్ వర్మకు ఏడవ పటాలపు గార్డు ఆఫ్ ఆనర్ టీం, బ్యాండ్ టీం ఆర్‌ఎస్‌ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించాయి.





