తెలంగాణ అనే పదానికి అనేక పర్యాయపదాలు చెప్పుకోవచ్చు. తెలంగాణ అంటే తిరుగుబాటు, తెలంగాణ అంటే విప్లవం, తెలంగాణ అంటే వీరత్వం, తెలంగాణ అంటే తెగువ, తెలంగాణ అంటే కొట్లాట… ఇట్లా తెలంగాణకు అనేక పర్యాయపదాలు. తెలంగాణ ఎన్నో పోరాటాలకు పుట్టినిల్లు. నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాడికల్స్ ఉద్యమం, పీపుల్స్ వార్, జనశక్తి తదితర ఎంఎల్ పార్టీల సాయుధ పోరాటాలు, ఎస్సీ వర్గీకరణ మరెన్నో సామాజిక పోరాటాలకు తెలంగాణ పురిటి గడ్డ. ఈ పోరాటాలన్నిటిలో యువతే ప్రధాన పాత్రధారులు. ఈ నేల చరిత్ర పొడుగునా జరిగిన ఎన్నో పోరాటాలు ఇక్కడి ప్రజల సాంస్కృతిక,రాజకీయ చైతన్యాన్ని తీర్చిదిద్దాయి.
దోపిడీ రాజ్యాంగాన్ని కూలదోసి సమసమాజ స్థాపన కోసం పశ్చిమ బెంగాల్లో పురుడు పోసుకుని శ్రీకాకుళం మీదుగా జగిత్యాల జైత్రయాత్రతో తెలంగాణలోకి అడుగుపెట్టిన నక్సల్బరీ పోరాటం సిపిఐ మావోయిస్టు పార్టీ రూపంలో ఇవాళ 16 రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ వ్యాప్తికి ప్రధాన కారణం అప్పటి తెలంగాణ యువ నాయకత్వమే అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. తెలంగాణ నేల చైతన్యం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల ఉద్యమాలకు దిక్సూచి. అది కాశ్మీర్ కావొచ్చు. మణిపూర్ కావొచ్చు. దండకారణ్యం కావొచ్చు. పాలెస్తీనా కావొచ్చు. ఆఫ్గనిస్తాన్ కావొచ్చు. దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఆక్రందనలు వినిపించినా బాధితులకు సంఘీభావం ప్రకటించేది తెలంగాణ. ఆ బాధితుల పక్షాన గొంతు వినిపిపించేది తెలంగాణ. ఆ సమస్య తమదే అయినట్టు, బాధితులు తమవారే అన్నట్టు మద్దతుగా కవితలు, రచనలు, ఇతర కార్యక్రమాలెన్నో చేసేది తెలంగాణ. అటువంటి ఈ నేల ఇప్పుడు ఆ సోయిని స్పృహను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది.
అందుకు కారణాలు కూడా స్పష్టంగానే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చరిత్రలో మొదటిసారిగా తెలంగాణాలో నిశ్శబ్దం ఆవరించింది. సమాజం అంతా సుఖ సంతోషాలతో వర్థిల్లుతున్నదని కాదు, సమస్యలేమీ లేక కాదు. తెలంగాణ ఎప్పటికీ ప్రగతిశీలమే అయినప్పటికి మొదటిసారి ఎందుకో తిరోగమిస్తున్నట్టనిపిస్తుంది. మొదట్లో తెలంగాణకు చెప్పుకున్న పర్యాయ పదాలన్నిటికీ ఈ నేల చరిత్ర పొడుగూతా జరిగిన ఉద్యమాలే కారణం. తెలంగాణ నేలపైన ప్రధానంగా చెప్పుకోవలసిన ఉద్యమాల్లో మొదటిది రైతాంగ సాయుధ పోరాటం. ఆ తరువాత పీపుల్స్ వార్ నాయకత్వంలో (ఇప్పుడు సిపిఐ మావోయిస్టు పార్టీ) కొనసాగిన, కొనసాగుతున్న సాయుధపోరాటం.
ప్రశ్నించే చైతన్యం లేకనే పాలకవర్గాలు చెప్పిందే వేదమన్నట్టు తలూపుతుంది ఈ తరం. మొత్తంగా ప్రశ్నించడమే నేరం అనుకుంటుంది ఈ తరం. తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఒక తరం దారి తప్పింది. ఈ తరాన్ని ఇలాగే వదిలేస్తే ఎన్నో దశాబ్దాల పోరాటాలు, వేలాది అమరుల రక్తతర్పణతో సాధించుకున్న సామాజిక విజయాలన్నీ తెలంగాణ సమాజం కోల్పోవాల్సి వస్తుంది. ఈ తరానికి సామాజిక స్పృహ అలవర్చడానికి ఎం చేయాలో పౌరసమాజం ఆలోచించాలి. కేంద్రంలో ఉన్న ఫాసిస్టు ప్రభుత్వం ఈ తరాన్ని ఇట్లా ఉంచడం ద్వారానే దాని మనువాద లక్ష్యాలను, కార్పొరేట్ల అనుకూల లక్ష్యాన్ని అది సాధించగలదన్న స్పష్టత దానికున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత బలమయిన ఫాసిస్టు మతోన్మాద ప్రభుత్వం కొలువు తీరి ఉంది. దాని లక్ష్యాన్ని సాధించేంత వరకూ అది కూలిపోతుందనే నమ్మకమూ లేనటువంటి సందర్భంలో, ఈ తరం యువతను ఎలా దారిన పెట్టాలో పౌరసమాజ పెద్దలు ఆలోచించాలి.
సబ్బండ కులాలు, జాతులు, వర్గాలు, ప్రజలందరు భాగస్వామ్యం అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అత్యంత దీర్ఘకాలంగా, అత్యంత ప్రజల భాగస్వామ్యంతో జరిగిన అతిపెద్ద ఉద్యమంగా చెప్పుకోవచ్చు. యువత, విద్యార్థులే అగ్రస్థానంలో ఉంది తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడం మనందరం చూసాం. ఎమ్మార్పీఎస్ నాయకత్వంలో కొనసాగిన వర్గీకరణ పోరాటం కూడా మాదిగ జాతి మొత్తాన్ని ఏకం చేసిన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమం. ఇట్లా తెలంగాణ చరిత్ర పొడుగూతా ఎప్పుడూ ఏదో ఒక బలమయిన సామజిక ఉద్యమం నడుస్తూ ఉండేది. ఆయా కాలాల్లో నడిచిన ఆ ఉద్యమాలన్నీ తెలంగాణ సమాజానికి గొప్ప సామజిక విజయాలు అందించడమే కాకుండా సమాజం పైన గొప్ప ప్రభావం కలిగించాయి.
కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్యం, వెట్టిచాకిరీ, దొరల-భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగింది. వేలాది ఎకరాల భూములను భూమి లేని పేదలకు పంచడం, వెట్టిని నిర్మూలించడం, దొరల అహంకారాన్ని అణిచివేయడం సహా అనేక విజయాలను సాధించింది. పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరిగిన సాయుధ పోరాటం తెలంగాణాలో విశేషమయిన మార్పులు తీసుకురాగలిగింది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అత్యంత వెనుకబడిన తెలంగాణ సమాజం ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి, ప్రజలు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులు కావడానికి పీపుల్స్ వార్, జనశక్తి, తదితర ఎంఎల్ పార్టీలు ఎంతో దోహదం చేశాయి. భూస్వాముల వద్దనుండి వేలాది ఎకరాలను భూములు లేని పేదలకు పంచడం, గ్రామాల్లో భూస్వాములు, దొరల ఆగడాలను అరికట్టడం, దళిత బహుజనుల పట్ల అగ్రకులాల అకృత్యాలను అడ్డుకట్ట వేయడం, మహిళలు ఎదురుకొంటున్న గృహహింస, దళిత బహుజనులు ఎదురుకొంటున్న కుల వివక్ష, రాజకీయ నాయకులు-ప్రభుత్వ అధికారుల అవినీతి, కూలీ రేట్ల పెంపు, తదితర ఎన్నో సామాజిక రుగ్మతలను రూపు మాపడంలో పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణాలో విశేష కృషి చేసింది. దాంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడే పాఠశాలల నిర్మాణం, చెరువులు-కుంటల నిర్మాణం, రైతాంగానికి ఆర్ధిక సహాయం చేయడం, మహిళా సాధికారత సాధన లాంటివెన్నో చేసింది.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్యం చేసింది. ఉద్యమానికి దారి తీసిన సామాజిక పరిస్థితులు, ఉద్యమాన్ని నడిపించిన శక్తుల కారణంగా తెలంగాణ సమాజం అనేక ప్రాపంచిక విషయాలను తెలుసుకోగలిగింది. మంద కృష్ణ మాదిగ నాయకత్వం వహించిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ద్వారా కూడా దళిత సమాజాన్ని సామాజిక చైతన్యవంతులను చేసింది. ఇవ్వే కాక మహిళా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు ఇటువంటివెన్నో తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసాయి. ఈ ఉద్యమాలను, పోరాటాలను తమ కళ్ళ ముందు జరుగుతుండగా చూస్తూ, అందులో పాల్గొంటూ, అధ్యయనం చేస్తూ, స్ఫూర్తి పొందుతూ తెలంగాణ యువతరం చైతన్యవంతం అయింది. ఏది ప్రగతిశీలమో, ఏది తిరోగమనమో తెలుసుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల పట్ల నిలబడాలనే మానవత్వం, సోయి కేవలం ఈ నేల మీద జరిగిన ఉద్యమాలే నేర్పాయి.
అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత చరిత్రలో మొదటిసారిగా ఈ నేల మీద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పోరాటానికి, తిరుగుబాటుకు మారుపేరయినా తెలంగాణ ఇప్పుడు చేవ చచ్చిందా అనిపిస్తుంది. గత 10 సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ ఏ ఒక్క ఉద్యమం తెలంగాణ సమాజం నిర్మించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 లో హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ ఇప్పుడు కాలేజీల్లో యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీజీలు చదువుతున్నారు. ఈ కొత్త తరానికి పోరాటాలు తెలియవు, ఉద్యమాలు తెలియవు, చరిత్రా తెలియదు. వీరికి చైతన్యమూ లేదు, సామజిక స్పృహ అస్సలూ లేదు. వీరి తరువాతి తరానికి, వీరి పిల్లలకీ ఇవేవీ తెలియకుండానే పెరిగిపోతారు. గాజా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా వీరికి పట్టింపు లేదు, దండకారణ్యంలో మన అన్నలను అతి కిరాతకంగా చంపుతున్నా వీరికి పట్టింపు లేదు. ఈ తరమంతా ఇప్పుడు హిందూ మత పునాదుల మీద, పరమత ద్వేషం మీద అశాస్త్రీయ విషయాల మీద నిర్మాణం అవుతోంది. సామజిక అవగాహన లేనందుకే భారత్ – పాకిస్తాన్ యుద్దాన్ని సమర్థిస్తోంది ఈ తరం.
చరిత్ర తెలియకనే తెలంగాణ నేల విముక్తి కోసం, తెలంగాణలో అణగారిన వర్గాలు తలెత్తుకుని బ్రతకనేర్పిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమయిన మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం అతి కిరాతకంగా చంపుతుంటే కనీసం సానుభూతి ప్రకటించడం లేదు ఈ తరం. ప్రశ్నించే చైతన్యం లేకనే పాలకవర్గాలు చెప్పిందే వేదమన్నట్టు తలూపుతుంది ఈ తరం. మొత్తంగా ప్రశ్నించడమే నేరం అనుకుంటుంది ఈ తరం. తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఒక తరం దారి తప్పింది. ఈ తరాన్ని ఇలాగే వదిలేస్తే ఎన్నో దశాబ్దాల పోరాటాలు, వేలాది అమరుల రక్తతర్పణతో సాధించుకున్న సామాజిక విజయాలన్నీ తెలంగాణ సమాజం కోల్పోవాల్సి వస్తుంది. ఈ తరానికి సామాజిక స్పృహ అలవర్చడానికి ఎం చేయాలో పౌరసమాజం ఆలోచించాలి. కేంద్రంలో ఉన్న ఫాసిస్టు ప్రభుత్వం ఈ తరాన్ని ఇట్లా ఉంచడం ద్వారానే దాని మనువాద లక్ష్యాలను, కార్పొరేట్ల అనుకూల లక్ష్యాన్ని అది సాదించగలదన్న స్పష్టత దానికున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత బలమయిన ఫాసిస్టు మతోన్మాద ప్రభుత్వం కొలువు తీరి ఉంది. దాని లక్ష్యాన్ని సాధించేంత వరకూ అది కూలిపోతుందనే నమ్మకమూ లేనటువంటి సందర్భంలో, ఈ తరం యువతను ఎలా దారిన పెట్టాలో పౌరసమాజ పెద్దలు ఆలోచించాలి.