దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరా

  • తెగిన ర‌హ‌దారులు, క‌ల్వ‌ర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌ 
  • పాడైన రోడ్లు, వంతెన‌ల‌కు శాశ్వ‌త నిర్మాణాలు 
  • 37 డివిజ‌న్ల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20:  రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్ల వివరాలపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komatireddy Venkat Reddy) అధికారులను ఆరా తీశారు. బుధవారం ఆయ‌న ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాజ్ వే లు,కల్వర్టులు,బ్రిడ్జిలు,కోతకు గురైన రోడ్ల వివరాలు మంత్రి అధికారులను అడిగితెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు,కల్వర్టుల వివరాలు ఆర్ అండ్ బి అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పాడైన రోడ్లు,వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ అండ్ బి హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులు,సమాచార వివరాలపై మంత్రి ఆరా తీయగా స్టేట్ రోడ్స్ సి.ఈ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో షిఫ్టుకు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి గత రివ్యూలో చెప్పిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బి డివిజన్ల నుండి వివరాలు సేకరణ చేస్తున్నామని,24 గంటలు అలెర్ట్ గా ఉంటున్నామని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ మంత్రికి తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో సెలవుపై వెళ్ళొద్దన్న ఆదేశాలు పాటిస్తూ..ప్రతి ఆర్ అండ్ బి అధికారి నిబద్ధతతో పనిచేశారని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్ బి పరిధిలో 739 చోట్ల సమస్యాత్మక రోడ్లు గుర్తించామని,అందులో 854 కి.మీ రోడ్డు దెబ్బతిందని, 25 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 5 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఆర్ అండ్ బి) మంత్రికి వివరించారు. 310 చోట్లలో కాజ్ వే లు,కల్వర్టులు వరద ప్రవాహం ఉంటే అందులో 228 దారి మళ్లింపు చేసినట్లు పేర్కొన్నారు. రాకపోకలకు ఇబ్బంది ఉన్న 232 ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన 175చోట్ల క్లియర్ చేశామని,మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని అన్నారు. మొత్తంగా 200 చోట్ల లో రోడ్లు, కాజ్ వే,మైనర్ బ్రిడ్జి లు, కల్వర్టులు తాత్కాలికంగా,శాశ్వతంగా పునరుద్ధరించాలని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

తాత్కాలిక పునరుద్ధరణకు రూ.46 కోట్లు వరకు ఖర్చు అవుతుందని,శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.984 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు వివరించారు. రోడ్ల డ్యామేజీ, ప్రజల రాకపోకలకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా,పలు దినపత్రికల్లో వార్తలు చూశానని వాటి క్షేత్ర స్థాయి పరిస్థితి ఏంటని మంత్రి ఆరా తీశారు. వెంటనే ఆ ప్రాంతాల్లో రీ స్టోర్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేట్ ఎన్‌హెచ్‌ రోడ్ల కు సంబంధించిన వివరాలు ఇన్‌చార్జి ఈఎన్సి జయ భారతి,ఆర్వోబి,ఆర్ యు బి ల వద్ద పరిస్థితిని సి.ఈ రాజేశ్వర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఆర్ అండ్ బి అధికారులు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలు, క్షేత్ర స్థాయిలో చూపిన పని తీరును అభినందించిన మంత్రి, అదే స్పూర్తితో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *