ఐక్య‌తా స్ఫూర్తిని చాటే తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్

– ప్రాంతీయ గుర్తింపు కోసం ఈశాన్య పౌరుల పోరాటం
– అన్నిరంగాల్లో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందుంజ‌
-ఈశాన్య సంస్కృతిని అర్థం చేసుకోవాలి
– ఫ్యూచ‌ర్ సిటీలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం
– ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20:  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో- కల్చరల్ ఫెస్టివల్ లో ఆయ‌న ముఖ్య అతిథిగా ప్ర‌సంగించారు. దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైంది.  పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతమ‌న్నారు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని  అంశాలు చాలా ఉన్నాయ‌న్నారు. ప్రాంతీయ గుర్తింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాల పౌరుల బాధను మన తెలుగు ప్రజలం సులభంగా అర్థం చేసుకోవచ్చు. 1970-80లలో ఉత్తరాది వారు మన దక్షిణాది వాళ్లందరినీ ‘మద్రాసీలు’ అని పిలిచేవారు. తెలుగువారికం టూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదని గుర్తుచేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు, సంస్కృ తుల మధ్య తేడాను వివరించడం దక్షిణాది వారికి కష్టంగా ఉండేది. అయినా ఎకానమీ పరంగా,  సాంస్కృతిక పరంగా, ఇతర రంగాల్లో దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయ‌న్నారు. మనం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, వారి సంస్కృతిని మరింత బాగా అర్థం చేసుకోవాలి. వారితో కనెక్టివిటీ పెంచుకోవాలి. అప్పుడే ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాలలో మన దేశానికి మరింతగా తోడ్పాటు అందించే రాష్ట్రాలుగా మారతాయ‌న్నారు. హైదరాబాద్‌లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, హెల్త్‌కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్‌లు, క్రీడలు వంటి అన్ని రంగాలలో వారు సక్సెస్ అయ్యారు. తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ ధన్యవాదాలు. దేశంలో తెలంగాణ మీకు మరో ఇల్లులాంటిద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న భారత్ ఫ్యూచర్ సిటీలో, భారతదేశపు మొట్టమొదటి ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్ర‌క‌టించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం వారి సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామ‌న్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు వారి వారి ప్రత్యేక భవనంతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆహారం, చేతివృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలు ఉంటాయి. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కు కల్చరల్ కనెక్ట్ ఈవేదికగా మొదలైంది. తెలంగాణ సోదరుడు త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్నారు. త్రిపుర సోదరుడు తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తున్నారు. త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాల‌ని ఆకాంక్షించారు. ఇండియాలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళదామ‌న్నారు. తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో -కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందన లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లడానికి మీ సహకారం ఉండాల‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page