నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌ ఫెస్టివల్‌కు తెలంగాణ ఆతిథ్యం

– హైటెక్స్‌ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు
– హాజరుకానున్న గవర్నర్‌, మంత్రి జూపల్లి, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: హైదరాబాద్‌ వేదికగా ‘తెలంగాణ- నార్త్‌ ఈస్ట్‌ ఇండియా కనెక్ట్‌.. ఏ టెక్నో-కల్చరల్‌ ఫెస్టివల్‌’ పేరిట సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపురల మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హైటెక్స్‌ లో ఈనెల 20 నుండి 22 వరకు, రాజ్‌ భవన్‌లో 25 నుండి 27 వరకు రెండు విడతలుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ కార్యాలయం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గురువారం సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్‌లో సంస్కృతుల సంగమం – సమృద్ధికి సోపానం అనే అంశంతో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హాజరుకానున్నారు. ఈ ఉత్సవం తెలంగాణ – ఈశాన్య రాష్ట్రాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యానికి కొత్త ఒరవడిని సృష్టిస్తుందని ఆశిస్తున్నారు.

మొదటి దశ : సాంస్కృతిక విభాగాలు (20-22, హైటెక్స్‌)
కళా ప్రదర్శనలు: లలిత కళలు (ఫైన్‌ ఆర్ట్స్‌), ప్రదర్శన కళలు (పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ప్రదర్శన.
విజ్ఞాన మార్పిడి: సాహిత్యంపై చర్చలు, ఫిల్మ్‌ ఫెస్టివల్‌.
సామాజిక అంశాలు: మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి, స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల స్టాల్స్‌ ఏర్పాటు.
యువతకు ప్రాధాన్యత: క్రీడా సంబంధిత కార్యక్రమాలు.
రెండవ దశ నైపుణ్యం : అభివృద్ధి (25-27, రాజ్‌ భవన్‌ అండ్‌ ఫీల్డ్‌ విజిట్స్‌)
ప్రధాన రంగాలు: వైద్యం అండ్‌ ఆరోగ్య శాస్త్రాలు, ఫార్మా అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌పై ప్యానెల్‌ చర్చలు
క్షేత్ర సందర్శనలు: హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌, జీనోమ్‌ వ్యాలీ, టి-హబ్‌ను సందర్శిస్తారు.
ముగింపు వేడుక: 27వ తేదీన రాజ్‌ భవన్‌లో ఉత్సవం ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page