ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణయే ఏటీఎం

– దిల్లీకి గులాంగిరీ చేస్తోన్న రేవంత్‌ ‌ప్రభుత్వం
– కాంగ్రెస్‌ అవినీతిపై ఇక నిరంతరంగా నిలదీస్తాం
– కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తాం
– ఏప్రిల్‌ 25 ‌చరిత్రను మార్చే రోజు అవుతుంది
– జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిల్లీకి గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఫోన్‌ ‌చేస్తే ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్‌రెడ్డి నిలబడే మాట్లాడుతున్నారని.. లేదంటే తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారని సెటైర్లు గుప్పించారు. తెలంగాణ జాగృతిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌ ‌కుమార్‌, ఆయన అనుచరులు బుధవారం చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాసి పెట్టుకోండి.. తెలంగాణ భవిష్యత్‌, ‌చరిత్రను మార్చే రోజు ఏప్రిల్‌ 25 అవుతుందని ఉద్ఘాటించారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటామని.. వారితోనే కలిసి పనిచేస్తామని మాటిచ్చారు. సామాన్యులతో, సామాన్యుల కోసం, సామాన్యులే ఉండేలా రాజకీయం తెస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్‌, ‌ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ‌ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేదెవరు అంటే ప్రతినోటా జాగృతియే అనే మాట వస్తోందని చెప్పారు. ప్రజల సమస్యల గురించి కాంగ్రెస్‌ ‌హై కమాండ్‌ని పైసలు అడిగితే నో రాహుల్‌ ‌జీ అని రేవంత్‌రెడ్డికి సమాధానం చెబుతున్నారని అన్నారు. కానీ కేరళ ఎన్నికల కోసం ఎంత ఖర్చయినా పెడుతున్నారని విమర్శించారు. అప్పర్‌ ‌తుంగభద్రకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాయేనని, కానీ ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని మెయింటెయిన్‌ ‌చేస్తూ ప్రజలను మాత్రం మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొత్త తరహా రాజకీయాలు, ప్రజల కోసం మంచి చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామని కవిత పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *