విశేష పురోగతి సాధించిన తెలంగాణ

– సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 7: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నుండి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ ప్రతినిధి బృందంలో బీమా, ఆర్థిక సేవలు, వ్యవసాయం, సాంకేతిక రంగాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి గురించి ప్రతినిధి బృందానికి సీఎస్ వివరించారు. 2014లో దేశంలోనే అత్యంత పిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత దశాబ్దకాలంలో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి గణనీయమైన పెట్టుబడుల వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. దేశంలో నగరీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, దాదాపు మూడోవంతు జనాభా హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌ను దేశంలోనే ఔషధ రాజధానిగా, సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల రక్షణ రంగ స్టార్టప్‌ల అభివృద్ధికి కూడా దోహదపడిందని చెప్పారు. అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లులో హైదరాబాద్ భారీ పెట్టుబడులను ఆకర్షించిందని, దేశంలో పేరుగాంచిన విద్యాసంస్థలు, ప్రపంచస్థాయి ఆరోగ్య సదుపాయాలు, బలమైన ఫిన్‌టెక్ పరిసర వ్యవస్థ ఇక్కడ ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సమృద్ధిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, ప్రసిద్ధ వంటకాలు వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షించే ముఖ్య కారణాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉండి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించడంలో ప్రతినిధి బృందానికి పూర్తి సహకారం అందిస్తుందని, తెలంగాణను గ్లోబల్ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమల డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, మలాచీ బ్రియాన్ నుగెంట్, ఆర్ దీపక్ జోషి, దివదృష్ట్ సింగ్ (అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్), వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *