తెలంగాణ గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజన్‌ కావాలి

– దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తులను సృష్టించి జేఎన్టీయూ
– వ్యసనాలకు దూరంగా.. పుస్తకాలు ,ల్యాబ్‌లకు దగ్గరగా ఉండండి
– విజన్‌-2047లో విద్య, స్కిల్స్‌, ఉపాధి రంగాలకు పెద్ద పీట
– జేఎన్టీయూ డైమండ్‌ జూబ్లీ వేడుకల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: తెలంగాణ గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజన్‌ కావాలి.. ఆ ఇంజన్‌ను ముందుకు నడిపేది జేఎన్టీయూనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం జరిగిన జేఎన్టీయూ డైమండ్‌ జూబ్లీ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావనీర్‌ను ఆవిష్కరించి పూర్వ విద్యార్థులను సన్మానించారు. అనంతరం ప్రసంగిస్తూ గత అరవై ఏళ్లలో లక్షలాది ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిపాలకులు, స్వప్నదృష్టులను తీర్చిదిద్దిన ఈ పవిత్ర స్థలంలో నిలబడి మాట్లాడటం ఒక అపూర్వమైన ఆనందం అని డిప్యూటీ సీఎం అన్నారు. జేఎన్టీయూ సంస్థకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు ఉండడం ఎంతో సార్థకమైందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారత భవిష్యత్తు విజ్ఞానంపై, ఆధునిక సంస్థలపై, యువత ధైర్యంపై నిర్మితమవుతుందని నెహ్రూ విశ్వసించారని తెలిపారు. సాంకేతిక విశ్వవిద్యాలయాలు దేశ పురోగతికి ఇంజన్‌గా మారాలని ఆయన కలగన్నారని, 1965లో నాగార్జునసాగర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌గా ప్రారంభమై 1972లో దేశ మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఎదిగి, నేడు 100 ఎకరాల కూకట్‌పల్లి క్యాంపస్‌గా జేఎఈ్టయూ ప్రపంచ ఖ్యాతిని పొందిందని, అనేక విజయాలను సాధించిందని అని తెలిపారు. గన్‌ఫౌండ్రి, మసాబ్‌ ట్యాంక్‌ నుండి ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీ, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ వరకు జేఎన్టీయూ ప్రస్థానం దేశ చరిత్రలో లిఖించదగిన గొప్ప సాహసోపేతమైన అధ్యాయం అని అన్నారు. ఇస్రో నుండి గూగుల్‌ వరకు, డీఆర్‌డీవో నుండి టెస్లా వరకు, పబ్లిక్‌ సెక్టార్‌ నాయకత్వం నుండి డీప్‌-టెక్‌ స్టార్టప్‌ల వరకు జేఎన్టీయూ భారతదేశాన్ని ముందుకు నడిపించిన తరాలను సృష్టించిందని డిప్యూటీ సీఎం వివరించారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అలుమ్ని జాబితా ఒక హాల్‌-ఆఫ్‌-ఫేమ్‌ మాదిరిగా ఉందన్నారు. జేఎన్టీయూ ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు.. ఒక జాతీయ ఆస్తి అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అపూర్వ సహకారం అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌-2047 డాక్యుమెంట్‌లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగ పునర్నిర్మాణం జరుగుతోందని తెలిపారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను ఆధునికీకరిస్తున్నామన్నారు. ఐఐటీలను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, ఇండస్ట్రీ 4.0 యుగానికి యువతను సిద్ధం చేస్తున్నామని వివరించారు. జేఎన్టీయూ సరిసమానంగా భారత్‌ స్కిల్‌ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని విక్రమార్క తెలిపారు.

భవిష్యత్తు అవకాశాలు సృష్టించేవారికి చెందుతుంది

ఉద్యోగం కోరేవారిగా కాక ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగండంటూ ఇంజనీరింగ్‌లో సమయాన్ని సెమిస్టర్లలో కొలుస్తారు.. ఒత్తిడిని బ్యాక్‌లాగ్‌లలో కొలుస్తారని నాకు తెలుసు.. కానీ మార్కుల కంటే ముఖ్యమైనది ఆసక్తి, ధైర్యం, ఆవిష్కరణ అంటూ విద్యార్థులకు భట్టి పలు సూచనలు చేశారు. ప్లేస్‌మెంట్లు ముఖ్యం, ప్యాకేజీలు ముఖ్యం.. కానీ భవిష్యత్తు అవకాశాలు సృష్టించే వారికి చెందుతుంది.. వేచి చూసేవారికి కాదు అని అన్నారు. 2027 నాటికి దేశంలో 1000 యూనికోర్న్‌ స్టార్టప్‌లు ఎదగనున్నాయి. రాష్ట్రం ఈ విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారడానికి సిద్ధమైంది అని తెలిపారు. జేఎన్టీయూలో ఇప్పటికే రోల్‌ మోడల్స్‌ ఉన్నారు. జాతీయ గుర్తింపు పొందిన ఆర్‌.నితిన్‌ వంటి స్టార్టప్‌ నాయకులు. ఇలాంటి కథలు మరిన్ని జేఎన్టీయూ నుంచి రావాలని ఆశిస్తున్నానన్నారు. ఈడీసీ, టెక్‌ బిజినెస్‌ ఇన్‌క్యుబేటర్‌, జే-హబ్‌ అన్నిటినీ ఉపయోగించండి.. ప్రభుత్వం మీతోపాటు నడుస్తుంది అని భరోసా కల్పించారు. మీ స్టడీ టైమ్‌ కంటే స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువైతే మీ డిగ్రీ ప్రమాదంలో ఉంటుంది.. మీ బ్యాటరీ మాత్రం కచ్చితంగా తగ్గుతుంది అని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. పుస్తకాలు, ల్యాబ్‌లు, మెంటర్‌లు, అవకాశాలకు దగ్గరగా ఉండండి అని ప్రేమ పూర్వక సలహా ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. జేఎన్టీయూ విద్యార్థులు ఇండియాను నడిపించాలి.. అయితే ఇండియా పరుగులు తీస్తున్నప్పుడు మొబైల్‌ స్క్రోలింగ్‌లో ఉండకండి అన్నారు. ప్రపంచం వేగంగా మారుతోంది.. పరిశ్రమకు నైపుణ్యవంతులైన, ఇన్నోవేటివ్‌, ఇండస్ట్రీ-రెడీ ఇంజనీర్లు కావాలి. కరికులం రిఫార్మ్‌, ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రీ భాగస్వామ్యం, మల్టీ-డిసిప్లినరీ అభ్యాసం మరింత బలపడాలన్నారు. కొత్త టెక్నాలజీలతోపాటు కోర్‌ బ్రాంచ్‌లను బలపరచాలని సూచించారు. మొదటి 60 సంవత్సరాలకంటే వచ్చే 60 సంవత్సరాలు మరింత మహోన్నతంగా ఉండాలనీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.

జేఎన్టీయూ సమస్యలపై దృష్టి పెడతాం

జేఎన్టీయూ న్యాయమైన భూమి లీజ్‌ సమస్య పరిష్కారం, లీజ్‌ రెంట్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ మినహాయింపు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పునరుద్ధరణకు రూ.800 కోట్లు.. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, జేఎన్టీయూ వీసీ కిషన్‌ కుమార్‌ రెడ్డి, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీ రెక్టార్‌ విజయ్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ కె.వెంకటేశ్వరరావు, ఉన్నతాధికారులు కృష్ణ ఆదిత్య, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *