Urea Shortage | యూరియా కొరత ఎవరి తప్పిదం?

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదా?.. లేక ఆ శాఖ మంత్రిదా??
  • ఒకరిపై ఒకరు రాజకీయ కీచులాట
  • ముందస్తు జాగ్రత్తలు తీసుకోని వ్యవసాయ శాఖ
  • బీఆర్‌ఎస్‌ హయాంలో మండలానికి రెండేసి ఆగ్రోస్‌ సెంటర్లు
  • కాంగ్రెస్‌ వచ్చాక ఆగ్రోస్‌ సెంటర్లను పట్టించుకోని వైనం
  • సీజన్‌కు ముందే యూరియా కొరత ఉంటుందనే ప్రచారం
  •  అయినా జాగ్రత్తలు తీసుకోని సర్కారు

హైద్రాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: తెల్లవారకముందే పొలాల వద్దకు వెళ్లినట్లు యూరియా (Urea Shortage ) కోసం రైతులు సొసైటీలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చుని విసిగి వేసారిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక లేకపోవడంతో ఆధార్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, చెప్పులు ఏది వీల్కెతే అది వరుసలో పెట్టి చెట్ల నీడన సేద తీరాల్సి వస్తోంది. ఇవి రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు. ఒక్క బస్తా కోసం రైతులు రోజులకొద్దీ తిరిగినా ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. తీరా అదును దాటిన తర్వాత పంటకు యూరియా వేయడం దండగే అంటూ కడుపు మండిన రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే ఈ యూరియా కష్టాలకు కారణం ఎవరు? యూరియా అవసరాలపై ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమా.. అధికారుల నిర్లక్ష్యమా.. లేక కేంద్రాన్ని బదనం చేసే రాజకీయ ఎత్తుగడ రివర్స్‌ అయిందా? అసలు యూరియా కష్టాలకు కారణాలు ఏంటి అనేవి పరిశీలిద్దాం. యూరియా కొరతతో రైతులు గగ్గోలు పెడుతుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు నువ్వుంటే నువ్వు అని ఒకరిపై ఒకరు మాటల తూటాలు, ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నాయి. రైతులు మాత్రం సొసైటీలు, ఆగ్రోస్‌ సెంటర్లు, ప్రైవేట్‌ షాపుల చుటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతు రాజ్యం అని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందనేది తర్కించుకోవాల్సిన విషయం. గతంలో పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడ్కెన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కూడా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారే. గత ఐదేళ్లుగా ఈ శాఖను ఆయన పర్యవేక్షిస్తున్నారు. అటు మంత్రి, ఇటు ఐఏఎస్‌ అధికారి ఇద్దరూ అనుభవజ్ఞ్ఞుల్కెనప్పటికీ రైతులకు యూరియా కష్టాల వెనుక కారణాలేంటనేది అంతుబట్టకుండా ఉన్నాయి. రాష్ట్రంలో జూన్‌ నుంచే ఖరీఫ్‌ సాగు మొదలు కాగా జూల్కె నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఆగస్టు చివరి దశ నుండి అవి తీవ్రమై ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిరదని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాదికన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ కొరతకు ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. ఖరీఫ్‌, రబీ మొదలు కావడానికి ముందే వ్యవసాయ శాఖ ఆయా సీజన్లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆమేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 9.80 ఎల్‌ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. ఆ ప్రకారం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతి నెలా 1.60 ఎల్‌ఎంటీకి తగ్గకుండా పంపాలి. యూరియాను సకాలంలో తెప్పించడంలో రాష్ట్రం విఫలమైందనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో యూరియా వినియోగం పెరగడం వల్ల బఫర్‌ స్టాక్‌ లేకుండా పోయింది. మొదట్లో ఉన్న యూరియాను ఇష్టానుసారంగా అమ్మేసి ఆ తర్వాత యూరియా దొరకదని జరిగిన ప్రచారం నేపథ్యంలో రైతులు కొంతమేర యూరియను ఇండ్లలో దాచుకున్నారు. ఈ కారణంగా పేద రైతులకు యూరియా దొరకకుండాపోయింది. పంట అదను సమయంలో వేయాల్సిన యూరియా అందుబాటులో లేకుండా పోవడంతో రైతుల్లో నిరసన, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి. సమన్వయం చేయాల్సిన వ్యవసాయ శాఖ కిందిస్థాయి అధికారులు చివరి నిమిషంలో అప్రమత్తమైనా పరిస్థితి చేయి దాటిపోయింది.

పెరిగిన సాగు విస్తీర్ణం, అధిక వినియోగం కారణం

రాష్ట్రంలో యూరియా కొరతకు కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ సాధారణంకన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతంకన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా ఈసారి 120 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్‌కన్నా 25 లక్షల ఎకరాలు ఎక్కువ. గత ఏడాది ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈసారి 55.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్‌లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగయింది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కొరతకు దారి తీసింది.

నానో యూరియాపై అధికారుల దృష్టి

నానో యూరియాపై అధికారులు దృష్టి పెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ప్రభుత్వం అభాసుపాలు కాక తప్పలేదు. చివరకు ప్రభుత్వం పరిస్థితిని గమనించి దీనిపై దృష్టి సారించినప్పటికీ రైతులను శాంతింపచేసే సమయం దాటిపోయింది. దీనికితోడు తమ ప్రభుత్వంలో యూరియా కొరత లేదనే ప్రధాన ప్రతిపక్షం ప్రచారంతో రైతులలో ప్రభుత్వంపై నిరసన పెరిగింది. దీంతో ఎంపీలు ముందుకొచ్చి యూరియా అందించాల్సింది కేంద్రమేనని, పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా యూరియా కొరత ఏర్పడిరదని కుంటిసాకులు చెప్పుకొచ్చారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తిప్పలు పడినప్పటికీ రైతుల వద్ద బదనాం అయింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిరదని మేధావులు అంటున్నారు.

జాగ్రత్తలు పాటించని మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రి తుమ్మల. ఈ ప్రభుత్వంలోనూ వ్యవసాయ శాఖ మంత్రి.  అయినప్పటికీ ఇపుడు యూరియా కొరతను ఎందుకు గుర్తించలేదని విమర్శకులు వాదిస్తున్నారు. యూరియా కొరత తీర్చేందుకు అధికారులు, కలెక్టర్లు, కమిషనర్లు, కిందిస్థాయి అధికారులు, పోలీస్‌ శాఖ మల్లగుల్లాలు పడుతున్నాయి.  కేంద్రం యూరియా ఇవ్వకపోవడం వల్లే కొరత ఏర్పడిరదని రాష్ట్రం చెబుతున్నప్పటికీ ముందుస్తు చర్యలు తీసుకుని ఉంటే కొరత ఏర్పడకపోయి ఉండేది అని పలువురు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఎంత వాడారు.. గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని వాదిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఫెర్టిల్కెజర్‌ జేడీఏగా, ఆగ్రోస్‌ ఎండీగా పనిచేసిన రాములు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం(2019) నుంచి ఇవ్వాల్టివరకు అదే శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉన్న రఘునందన్‌రావులు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు. వీరి ఆధ్వర్యంలో ఆ సమయంలో కొరత లేకుండా రైతులకు సాఫీగా అందజేయగా ఇప్పుడెందుకు విఫలమయ్యారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ అధికారులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం పాటించలేదా.. ప్రతిపక్షాల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఈ సమస్యను సృష్టించి ఇరుకునపడిరదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఆగ్రోస్‌ 20 శాతం యూరియాను ఎందుకు తొలగించారు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ను ఆకాశమంత ఎత్తుకు లేపి నిరుద్యోగ యువతకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పేరుతో ఒక్కో మండలానికి రెండేసి ఆగ్రోస్‌ సెంటర్ల చొప్పున కేటాయించి నియోజకవర్గ ఎమ్మెల్యే లెటర్‌ కాపీలను జతపరస్తూ ఒక్కొక్క సెంటర్‌కు బీసీలకు రూ.1.50లక్షలు, ఓసిలకు రూ.3లక్షల వరకు ఆయా నిర్వాహకుల వద్ద డిపాజిట్‌ చేయించుకున్నారు. వీరికి మేనేజ్‌ సంస్థ ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించి బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల వరకు రుణాలు కూడా ఇప్పించారు. ఈ తంతంగం ప్రస్తుత ఆగ్రోస్‌ ఎండీ, ప్రస్తుత ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు, అప్పటి మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీరి ఆగ్రోస్‌కు ఆగ్రోస్‌ ఎండి రాములు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో 20 శాతం యూరియా ఉచితంగా కేటాయించి రైతులకు అందుబాటులో ఉంచింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు నెలలు ఎంపీ ఎన్నికల పేరుతో కాలయాపన చేసి ఆగ్రోస్‌కున్న 20 శాతం యూరియాను తొలగించింది. దీనికితోడు ఆ సంస్థలో పనిచేస్తున్న జిల్లాల వారీ ఉద్యోగస్తులను తొలగించారు. అంతేకాక ప్రైవేట్‌ షాపుల పేరుతో మండలాల్లో ఉన్న ఆగ్రోస్‌ సెంటర్లకు యూరియా సరఫరా తగ్గించడం మొదలుపెట్టారు. ఒక్కో సెంటర్‌కు ‘ఎఫ్‌ఎల్‌’ పేరుతో, కొన్ని ‘ఎక్స్‌’ యూరియా సరఫరా చేస్తూ కొద్దికొద్దిగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం యూరియా కొరత పేరుతో ఆగ్రోస్‌ సెంటర్లకు యూరియా నిలిపివేసి ఒక్క సొసైటీలకు మాత్రమే అందజేస్తున్నారు.

ఆకా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎసిఎ) ఎందుకు తీసుకొచ్చారు?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లేని ఆకా కార్పొరేషన్‌ సెంటర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌ రావులు ఎందుకు తీసుకొచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ (ఆగ్రోస్‌ సెంటర్ల)ను పట్టించుకోకుండా ఆగ్రోస్‌కు ఉన్న 20 శాతం యూరియాను తొలగించి ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆకాను ఎందుకు ముందుకు తీసుకొచ్చిందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదడులో తొలుస్తున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఆకా సెంటర్ల కోసం నిర్వాహకుల నుండి డిపాజిట్ల రూపంలో డబ్బులు తీసుకున్నారు. గత ప్రభుత్వం ఆగ్రోస్‌ సెంటర్ల పేరుతో యువతను మోసం చేసింది. ఈ ప్రభుత్వం ఆకా పేరుతో యువతను మోసం చేస్తున్నదనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రైతులకు యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా వ్యవసాయ శాఖలు విఫలం చెందాయనే చెప్పాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *