రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం?

– ప్రమాదఘంటికలు మోగిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం
– కొనుగోళ్లు పడిపోవడానికి మితిమీరిన సంక్షేమం కారణమా?
– పండుగ రోజుల్లో డిమాండ్‌ పడిపోవడం దేనికి సంకేతం??
– కాంగ్రెస్‌ పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: దేశవ్యాప్తంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో కనిష్టస్థాయి అయిన 1.5%కి పడిపోయినప్పటికీ తెలంగాణ మాత్రం గత నాలుగు నెలల్లో మూడు నెలలు ప్రతి ద్రవ్యోల్బణం దశలోకి జారుకోవడం ఆర్థిక నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో లోతుగా కూరుకుపోయిందనడానికి ఇది స్పష్టమైన సంకేతమని ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో జూన్‌ (-0.93%), జులై (0.44%), సెప్టెంబర్‌ (0.15%) మాసాల్లో ప్రతి ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే ఈ హెచ్చరికల్లో వాస్తవమున్నట్టు స్పష్టమవుతోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం తెలంగాణ మరోసారి సెప్టెంబర్‌లో 0.15 శాతం ద్రవ్యోల్బణాన్ని సూచిస్తోంది. ఇతర రాష్ట్రాలు అస్సాం -0.51, బీహార్‌ -0.51, ఉత్తర ప్రదేశ్‌ -0.61 ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారుకున్నాయి. ఉత్సవాల సీజన్‌లోనూ ధరల పతనం కొనసాగిందంటే వినియోగదారుల డిమాండ్‌ కుప్పకూలిందని భావించాల్సి వస్తున్నది. సాధారణంగా సెప్టెంబర్‌ నెల బతుకమ్మ-దసరా పండుగల కారణంగా వినియోగం అత్యధికంగా ఉండే సమయం. ఈ పండుగల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు పెరిగి ధరలు, ద్రవ్యోల్బణం సానుకూలంగా నమోదవ్వాలి. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా ద్రవ్యోల్బణం మైనస్‌లోకి పడిపోవడం (-0.15%) రాష్ట్రంలోని వినియోగదారుల డిమాండ్‌ పూర్తిగా పడిపోయిందనడానికి, మార్కెట్‌ కార్యకలాపాలు మందగించాయని స్పష్టమవుతోంది. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్లడాన్ని ‘ప్రతి ద్రవ్యోల్బణం’ లేదా ‘డీఫ్లేషన్‌’ అంటారు. అంటే వస్తువులు, సేవల ధరలు పెరగకపోగా క్రమంగా తగ్గుతున్నాయని అర్థం. ఇది తాత్కాలికంగా వినియోగదారులకు మంచిగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సంకేతం.
ప్రతి ద్రవ్యోల్బణం అనేక ప్రతికూల ప్రభావాలకు కారణమవుతుంది. వీటిల్లో మొదటిది ధరలు తగ్గుతాయనే భయంతో ప్రజలు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటారు, తద్వారా మార్కెట్లో డిమాండ్‌ మరింత పడిపోతుంది. రెండవది డిమాండ్‌ లేకపోవడంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తాయి. మూడవది ఉత్పత్తి తగ్గడంతో ఉద్యోగులను తగ్గించాల్సి వస్తుంది, నిరుద్యోగం పెరుగుతుంది. నాల్గవది ఆర్థిక కార్యకలాపాలు తగ్గడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ వంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారడానికి, పడిపోతున్న వినియోగదారుల డిమాండ్‌కి కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నిరర్థక ప్రభుత్వ విధానాలు, ఆర్థిక నిర్వహణ వైఫల్యం, పక్షపాత రాజకీయాలతో కూడిన పాలన కారణంగా స్థానిక మార్కెట్లు కుదేలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక ప్రమాదకరమైన పాతాళం వైపు పయనిస్తోంది’ అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం, బిల్లుల చెల్లింపుల సమస్యలు వంటివి ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీశాయని విశ్లేషణలు సూచిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాల్సి ఉంది. అయితే గతంలో ప్రతి ద్రవ్యోల్బణంపై వచ్చిన విమర్శలకు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు భారం తగ్గిందని, అందుకే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వాదించింది. కానీ, వరుసగా మూడు నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడం, ముఖ్యంగా పండుగల సీజన్‌లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగడం ఈ వాదనను బలహీనపరుస్తోంది.

రేవంత్‌ సర్కార్‌ ఫెయిల్‌ : మాజీ మంత్రి హరీష్‌రావు

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయనిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వొచ్చిందన్నారు. భారత దేశ రిటైల్‌ ద్రవ్యోల్బణం 1.54శాతంగా నమోదైతే తెలంగాణలో నెగిటివ్‌ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదన్నారు. జూన్‌లో 0.93%, జూలైలో -0.44%, సెప్టెంబర్‌లో -0.15%లలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్‌ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడుసార్లు నమోదు కావడం ఇదే మొదటిసారి అన్నారు. కేసీఆర్‌ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రేవంత్‌ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్‌ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని నానాటికీ చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించమని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *