తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి
శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి
పర్యాటక, సాంస్కృతిక శాఖ  మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వొచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ  సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి,  సంప్రదాయాలు ప్రతిబింబించేలా  ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం  మంత్రి జూపల్లి కృష్ణారావు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించి, స్వాగత సత్కారాల ఏర్పాట్లను  స్వయంగా పర్యవేక్షించారు. మిస్ వరల్డ్ వేడుకలకు వొచ్చే  సుందరీమణులు, ప్రతినిధులు, ఇతర అతిథులకు స్వాగత ఏర్పాట్లను  మంత్రి జూపల్లి స్వయంగా పరిశీలించారు.

జీఎంఆర్ ప్యాసెంజర్ ఎక్స్పీరియన్స్ , పర్యాటక శాఖ,  కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్ఎఫ్ అధికారులతో సమీక్షించారు. విమానాశ్రయాన్ని మరింత అందంగా ముస్తాబు చేయాలని, పూలు, మామిడి, అరటి తోరణాలతో సుందరంగా  అలంకరించాలని  సూచించారు. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్ ను త్వరగా పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వాగత బృందాల సంఖ్యను పెంచాలని చెప్పారు. అడుగడుగునా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని తెలిపారు. అదే సమయంలో ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన  మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్ సర్వాంతేస్ తో భేటీ అయ్యారు. తెలంగాణలోని  వారసత్వ, చారిత్రక కట్టడాలను సందర్శించాలని వారిని కోరారు.  ఈ సందర్భంగా అల్ ది బెస్ట్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *