4న తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

రైతు భరోసా, పేదలకు నగదు, కొత్త రేషన్‌ ‌కార్డులపై చర్చ
యాదగిరిగుట్ట బోర్డు నియామకంపైనా చర్చకు అవకాశం
సిఎం రేవంత్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌తెలంగాణరాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్‌ ‌కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశముంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్‌ ‌కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్‌, ‌స్టీల్‌ ‌సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్‌ ‌చర్చించనున్నట్లు సమాచారం. విద్యుత్‌ ‌కమిషన్‌, ‌బీసీ డెడికేటెడ్‌ ‌కమిషన్‌, ఎస్సీ వర్గీకరణ కమిషన్‌ ‌నివేదికలపై చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి తితిదే తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన టూరిజం పాలసీపై కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు.

కొత్త ఏడాది కానుకగా తెలంగాణ ప్రభుత్వం పలు హామీల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా జనవరి 4న సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్‌ ‌లో సాయంత్రం 4 గంటలకు ఈ కేబినెట్‌ ‌సమావేశం నిర్వహించనున్నారు.  కేబినెట్‌ ‌సమావేశంలో కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ, రైతు భరోసా, బీసీ రిజర్వేషన్‌ ‌లపై డెడికేటెడ్‌ ‌కమిషన్‌ ‌నివేదిక, ఎస్సీ వర్గీకరణ, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం మొదలైన అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే రైతు భరోసా, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన విషయం తెలిసిందే. సంక్రాతి కానుకగా కొత్త రేషన్‌ ‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఇటీవల ఉపముఖ్యంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్‌ ‌కేబినెట్‌ ‌భేటీ జరిగింది. కొత్త రేషన్‌ ‌కార్డులు, రైతు భరోసా, భూభారతి, నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం తదితర అంశాలపై ఉపసంఘం సమావేశంలో చర్చించారు. మంత్రి వర్గ ఉపసంఘంలో చర్చించిన అంశాలను కేబినెట్‌ ‌కు సిఫారసు చేశారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సబ్‌ ‌కేబినెట్‌లో చర్చించిన అంశాలను అభిప్రా యాలను జనవరి 4న జరగబోయే కేబినెట్‌  ‌పరిగణనలోకి తీసుకోనుంది. ఉపసంఘం సిఫారసుల ఆధారంగా చర్చించి ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పేందుకు మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. జనవరి నాలుగున రాష్ట్ర ప్రజలకు దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేయనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *