– ఇందుకోసం చట్టంలో అవసరమైన సవరణలు
– పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు చర్యలు
– జూబ్లీ హిల్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్
– మంత్రివర్గ కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంగళవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లతోపాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్తు విభాగం అధికారులు సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు విద్యుత్ సరఫరా చేసే కాలపరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ళ కాల పరిమితితోనే ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పలుచోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కమ్ ల వద్ద ఉన్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ ను ముందుగా మన డిస్కమ్ లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్ లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపీసీకి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది.. జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగుళూరు లో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ సిస్టమ్ ఉంది. అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు ఇటీవలే అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ.14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తోపాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీ లతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





