హైదరాబాద్, ప్రజాతంత్ర : బతుకమ్మ పండుగ (Bathukamma Festival 2025) ను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నదని రాష్ట్ర టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. రాబోయే బతుకమ్మ పండుగ-2025 నిర్వహణ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో బుధవారం బేగంపేట్ హరిత ప్లాజా హోటల్ లో వివిధ శాఖల ఉన్నతాధికారుల అభిప్రాయాలు సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్ మహానగరంతో పాటు, వరంగల్ మరికొన్ని జిల్లాల్లో బతుకమ్మ పండుగ సంబురాలు చేపడతామని అన్నారు. తెలంగాణ కళారూపాలు బతుకమ్మ పండుగలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశ అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పండుగ ఖ్యాతిని పెంచే దిశగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్లు, పండుగ యొక్క సాంప్రదాయం , వేడుకల నిర్వహణ విధి విధానాలు, స్వయం సహాయక సంఘాల పాత్ర, కులవృత్తుల వారు తయారుచేసిన వస్తువుల విక్రయాలు, కళా ప్రదర్శనలు తదితర అంశాలపై శాఖల వారీగా అభిప్రాయాలను స్వీకరించారు.
గతంలో కంటే ఎక్కువ నిధులు
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ నిర్వహణకు గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క గుర్తింపని, అన్ని శాఖలు సమన్వయంతో కలసి పనిచేసి ఈ బతుకమ్మ వేడుకలను మరింత ప్రతిష్టాత్మకంగా, సమగ్రంగా, ప్రభావవంతంగా నిర్వహించే దిశగా ఏర్పాట్లు ఉంటాయని ఆయన తెలిపారు.
సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, టూరిజం కార్పొరేషన్ ఎండి క్రాంతి వల్లూరి, అదనపు సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రత్యేక అధికారి కిషన్ రావుతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, పోలీస్ వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.





