– ‘ఏఐ’తో ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహే
– సంక్షోభంతోపాటే కొత్త అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: ‘స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణను మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో తెలంగాణ యువతను పరిశ్రమల భాగస్వామ్యంతో అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులుగా తీర్చిదిద్దేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్‌ఐసీ)లో బుధవారం నిర్వహించిన ‘స్కిల్ కాన్వకేషన్ ఇన్ ఐటీ/ఐటీఈఎస్ సెక్టార్ అండ్ ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్ హ్యాకథాన్ 2025’ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ టెక్నాలజీ రోజురోజుకీ వేగంగా మారుతోందని, ఆ మార్పులను అందిపుచ్చుకోగలిగితేనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రెండేళ్లలోనే 40 శాతానికి పైగా అంతర్జాతీయ కంపెనీలు జనరేటివ్ ఏఐను తమ కోర్ వర్క్‌లో భాగం చేసుకున్నాయన్నారు. ‘ఏఐ’ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది అపోహేనని, అది కేవలం ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందని అన్నారు. ఆటోమేషన్ వల్ల 85 మిలియన్ జాబ్స్ పోతే కొత్తగా 97 మిలియన్ల స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తేల్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్షోభంతో పాటే కొత్త అవకాశాలు కూడా వస్తాయని, అందుకు సంసిద్ధంగా ఉండాలని యువతకు సూచించారు. ఓ వైపు సైబర్ క్రైమ్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయని, మరోవైపు ఎథికల్ హ్యాకర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందన్నారు. వాతావరణ మార్పుల వల్ల క్లీన్ టెక్, ఈవీలు, గ్రీన్ ఇన్నోవేషన్ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. అలా అని ఈ డిజిటల్ యుగంలో కేవలం అకడమిక్ డిగ్రీలతో మాత్రమే ఉద్యోగాలు రావని, ఇన్నోవేషన్, ప్రాబ్లం సాల్వింగ్, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటేనే సక్సెస్ సాధ్యమని చెప్పారు. తమ ప్రభుత్వం భవిష్యత్తును కేవలం ఊహించడం లేదని, దానికి అవసరమైన ‘స్కిల్లింగ్ ఎకో సిస్టం’ను నిర్మిస్తోందన్నారు. మార్కెట్, పరిశ్రమల అవసరాలకనుగుణంగా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకుందని వివరించారు. కార్యక్రమంలో ఈఎస్‌ఐసీ డైరెక్టర్ డాక్టర్ రామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





