సహకార రంగంలో మార్గదర్శిగా తెలంగాణ

– సహకార సంఘాల వల్లే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
– డిజిటల్ స్మార్ట్ దిశగా వ్యవసాయ రంగం
– 2024 -25లో సహకార సంఘాల ద్వారా రూ.7500 కోట్ల రుణాలు
– దేశంలోనే తొలిసారిగా పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ
– నాబార్డ్ కో ఆపరేటివ్ కాంక్లేవ్ లో మంత్రి తుమ్మల

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః స‌హ‌కార‌ సంఘాల వల్లే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దేశ సహకార రంగంలో తెలంగాణ మార్గదర్శి గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాలు-2025 సందర్భంగా నాబార్డ్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్క‌డ నిర్వహించిన కో ఆపరేటివ్ కాంక్లేవ్ లో ఆయ‌న మాట్లాడారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నద‌ని, ఈ రంగ ప్రోత్సాహంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. సుస్థిర వ్యవసాయంలో ప్రజా ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు. 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతు, పెట్టుబడి సహాయం, రైతు బీమా పథకాలు అందిస్తున్నాం.. రైతు నేస్తం ద్వారా నిపుణుల సలహాలు, సౌర సాగునీరు, యాంత్రీకరణకు ప్రోత్సాహం ఇస్తున్నాం.. ప్రభుత్వ సహకారంతో 1.89 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ నిలిచింది.. కంది, వేరుశనగ వంటి పంటల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది అన్నారు. ఉద్యాన రంగంలో 42 లక్షల టన్నుల ఉత్పత్తి – మిర్చి, పసుపు, ఆయిల్ పామ్‌ సాగు పురోగతిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం.. ఆయిల్ పామ్ విస్తరణతో దేశానికే మార్గదర్శి గా తెలంగాణ మారుతుంది.. మక్క, పప్పులు, చిరుధాన్యాల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం.. వాతావరణ మార్పులను త‌ట్టుకునే దిశగా వ్యవసాయరంగంలో ఆధునికతను పెంపొదించడం తెలంగాణ విజన్ – 2047 లక్ష్యం.. రైతు ఆదాయం పెంచే, పర్యావరణాన్ని కాపాడే వ్యవసాయ వ్యవస్థే లక్ష్యం.. కొత్త సాంకేతికత, ఏఐ, ఐఓటీ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాం.. ఆహార, పోషక స్వయం సమృద్ధి సాధించడంపై దీర్ఘకాల దృష్టి పెట్టాం అని తుమ్మ‌ల చెప్పారు. విజన్ డాక్యుమెంట్ ప్రధాన అంశాలు వివరిస్తూ మొబైల్ సాయిల్ టెస్టింగ్ ద్వారా వాతావరణానికి తగ్గట్టు వ్యవసాయం, పునరుత్పాదక శక్తితో వ్యవసాయ యాంత్రీకరణ, 2047 నాటికి నాలుగు వేల‌ గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం.. 39.5 లక్షల ఎకరాలకు స్మార్ట్ మైక్రో ఇరిగేషన్.. ఆహార ప్రాసెసింగ్, విలువ జోడింపు, పరిశోధన కేంద్రాలు.. ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, ఉద్యానవన మెగా క్లస్టర్ల ఏర్పాటు.. 100 విత్తన హబ్ లు, సీడ్ రీసెర్చ్ పార్కుల ఏర్పాటుతో సీడ్ ఎగుమతులు పెంచడం.. కోల్డ్ స్టోరేజీలు, పీఏసీఎస్ అండ్ ఎఫ్ పీవోల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆయ‌న చెప్పారు.
సహకార సంఘాలు రైతులకు రుణాలు మాత్రమే కాదు.. విత్తనాలు, ఎరువులు, సేవలు కూడా అందిస్తున్నాయ‌ని, 2024-25లో సొసైటీల‌ ద్వారా రూ.7500 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 311 పీఏసీఎస్‌ లను ఎఫ్‌పీవోలుగా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. దేశంలోనే మొదటగా పీఏసీఎస్‌ల‌ను కంప్యూటరీకరించామ‌న్నారు. సహకార బ్యాంకుల్లో డిజిటల్ సేవలు ప్రారంభించామ‌న్నారు. నాబార్డ్ పాత్ర గూర్చి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దశాబ్దకాలంగా నాబార్డ్ సహకార రంగాన్ని బలోపేతం చేస్తోంద‌న్నారు. పీఏసీఎస్‌లను మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చడంలో కీలక సహకారం అందిస్తున్న‌ద‌న్నారు. గోదాములు, సౌర విద్యుత్, శిక్షణ, డిజిటలైజేషన్‌కు మద్దతు ఇస్తుంద‌న్నారు. ఎరువులు, విత్త‌న అమ్మకాలు, పెట్రోల్ బంకుల‌ నిర్వహణ మొదలైన పరపతేత‌ర వ్యాపారంలో అత్యధిక పురోగతి సాధిoచిన, రుణాల రికవరీలో 100 శాతం పురోగతి సాధించిన రాష్ట్రంలోని 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు నాబార్డు ద్వారా మంత్రి చేతుల మీదుగా స‌ర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కొండూరి రవీందర్ రావు నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్, ముంబై నాబార్డ్ సీజీఎం మణి కుమార్ ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయనీ కుమార్, డీసీసీబీ సీఈవోలు, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *