నెట్ జీరో స్టేట్‌గా తెలంగాణ

– అందుకే ‘క్యూర్‌’, ‘ప్యూర్‌’, ‘రేర్‌’గా విభజన
– పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం
– ముంబయి క్లైమేట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ కీలక ప్రసంగం

ముంబయి, ఫిబ్రవరి 18: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా తెలంగాణలో గ్రీన్ ఎనర్జీని తాము ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు. దేశ పట్టణాభివృద్ధికి సంబంధించిన సదస్సులో మాట్లాడడం తనకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా పంప్‌సెట్‌లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఈ శక్తిని బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను 2034నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలి నాలుగు దశాబ్దాల్లో దేశంలో ప్రధాన ప్రాధాన్యతలు విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాలేనని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నుంచి ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీటికి భారీ ఆనకట్టలను నిర్మించి రైతుల పొలాలను నీటితో అనుసంధానించామని తెలిపారు. 1990 నాటికి భారత్ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిందని చెప్పారు. దీంతో ప్రజల జీవిత కాలం పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోని ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలతో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి సాధించినట్లు వివరించారు.

1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలతో భారత్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని సీఎం అన్నారు. టెలికం, సాఫ్ట్‌వేర్ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమైందన్నారు. భారత నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రపంచ కేంద్రాల్లో విజయాలు సాధించారని తెలిపారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్‌వేర్, టెక్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకున్నాయని తెలిపారు. అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) మన దేశంలో ఉన్నాయన్నారు. అయితే ఈ టెక్ పురోగతిలో తయారీ రంగం ఎక్కువగా అవకాశాలు కోల్పోయినట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అన్నారు. విద్యుదుత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను క్యూర్‌’, ‘ప్యూర్‌’, ‘రేర్‌’ జోన్‌లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 24.8% లేదా దాదాపు 25% గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని తెలిపారు. అదేవిధంగా 360 కి.మీ పొడవు గల రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితి క్లైమేట్ ఎమర్జెన్సీ

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని తెలిపారు. వాతావరణ మార్పులు, కోవిడ్ ప్రభావాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితిని క్లైమేట్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి సృష్టి, ఉత్పత్తి, వినియోగం పెంపు కొనసాగుతూనే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ‘క్యూర్’  ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా ఈవీల స్వీకరణ పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తుండగా, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామన్నారు. హైదరాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ నుంచి 200 కి.మీ పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్‌లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణ ప్రమాదాలను తగ్గించి నగరాన్ని సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *