టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణ

– రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్ ఆవిష్కరణ్ణ
– మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల

హైదరాబాద్‌లో జరగనున్న 13వ ఆసియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనేకాక ప్రపంచస్థాయిలో టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే ఎటెక్స్‌కాన్-2026 ద్వారా దేశీయ-అంతర్జాతీయ టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, నిపుణులు ఒకే వేదికపైకి రావడం ద్వారా తెలంగాణలో టెక్స్‌టైల్ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సిటీ) భాగస్వామ్యంతో 2026 ఏప్రిల్ 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టెక్స్‌టైల్ రంగంలో సస్టయినబిలిటీ, సాంకేతికత, సరఫరా వ్యవస్థల అభివృద్ధి, గ్లోబల్ మార్కెట్ల అవకాశాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. అదనంగా ఏప్రిల్ 4న వరంగల్‌లోని పీఎం మిత్ర పార్కుకు పరిశ్రమల సందర్శన కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణను టెక్స్‌టైల్, అపారెల్, ఫుట్‌వేర్ తయారీకి అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రులు తెలిపారు.

22న నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం

నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోందని తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఈ నెల 22న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో స్థాపించిన రెండు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. నర్మెట యూనిట్ ప్రారంభ దశలో గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుండగా, భవిష్యత్తులో గంటకు 120 టన్నుల వరకు విస్తరించే విధంగా రూపకల్పన చేసినట్లు చెప్పారు. సుమారు రూ.300 కోట్లతో నిర్మించిన ఈ ఆధునిక యూనిట్ ఆయిల్ పామ్ రైతులకు ఎంతో మద్దతుగా నిలవనుందని మంత్రి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *