– టీఏఐహెచ్ ప్రారంభంతో ఆర్థిక ప్రగతి వేగవంతం
– టాప్ 20 ఇన్నోవేషన్ హబ్‌లలో రాష్ట్రాన్ని చేర్చడమే లక్ష్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశలో ఒక చారిత్రాత్మక అడుగుగా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్) ను దావోస్‌లో ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఈనెల 20న ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఏఐ పరిజ్ఞానాన్ని ఇమడ్చటం, ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థగా, టీఏఐహెచ్ ప్రపంచంలోనే తొలి “ప్రపంచ ఏఐ ప్రయోగ వేదిక”గా పనిచేస్తుంది. ఇప్పటిదాకా భారతదేశపు టెక్నాలజీరంగపు కేంద్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు ప్రపంచ నూతన ఆవిష్కరణల రాజధానిగా మారిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. దావోస్‌లో తాము కేవలం పెట్టుబడులు మాత్రమే అడగడం లేదని, భాగస్వామ్యాలకై చేయి చాస్తున్నామని వివరించారు. నూతన ఆవిష్కరణలు, ప్రతిభల మేలుకలయికగా ఉన్న తెలంగాణలో ఏఐ భవిష్యత్‌ను నిర్మించడానికి ప్రపంచదేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రపంచానికి ఒక శాండ్‌బాక్స్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్ వంటి డీప్‌టెక్ రంగాలలో నూతన ఆవిష్కరణలకు చోదక శక్తిగా పనిచేసేలా టీఏఐహెచ్ రూపొందించబడింది. తెలంగాణ యొక్క ప్రగతిశీల ఏఐ వ్యూహంలో భాగంగా, విధానాల రూపకల్పన నుండి భారీస్థాయి అమలు దిశగా ఒక నిర్ణయాత్మక మార్పును టీఏఐహెచ్ సూచిస్తుంది. ప్రపంచానికి మరో ఇంక్యుబేటర్ అవసరం లేదని, ఒక ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు. టీఏఐహెచ్ ప్రారంభంద్వారా తాము ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో డీప్‌టెక్ రంగాలలో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ అత్యంత సురక్షితమైన, ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ ఉత్పత్తులు తెలంగాణలో రూపుదిద్దుకుంటాయని చెప్పారు. నూతన ఆవిష్కరణల వేగానికి అనుగుణంగా విస్తృత స్థాయిలో పనిచేయగల కొత్త సంస్థాగత నమూనాగా టీఏఐహెచ్ రూపుదిద్దుకుంది. ప్రభుత్వ సంస్థలు ఎలా రూపకల్పన చేయబడతాయి, నిర్వహించబడతాయి అనే దానిని పునర్నిర్మించడం ద్వారా, వేగవంతమైన ప్రయోగాలు, వేగవంతమైన అమలు, ప్రైవేట్ రంగంతో లోతైన భాగస్వామ్యాన్ని టీఏఐహెచ్ సాధ్యం చేస్తుంది. టీఏఐహెచ్ యొక్క ప్రత్యేక బలం దాని రూపకల్పనలోనే ఉందని, ఇది వేగం, స్థాయి, ప్రభావం కోసం రూపొందించిన సంస్థ అని ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ కుమార్ అన్నారు. స్టార్టప్ చురుకుదనం, ఎంటర్‌ప్రైజ్ సామర్థ్యం, ప్రభుత్వ విశ్వసనీయత, విస్తృతిని సమన్వయం చేయడం ద్వారా, ఇది వేగవంతమైన ఇన్నోవేషన్‌ను సాధ్యం చేస్తుందని తెలిపారు. ఉత్పత్తి–మార్కెట్ సరిపోలికను వేగవంతం చేస్తుందని, వెంచర్ క్యాపిటల్‌ను ఆకర్షిస్తుందని, పైలట్ దశను దాటి విభిన్న రంగాల్లో విస్తృత స్థాయి వాణిజ్య అమలుకు పరిష్కారాలను తీసుకెళ్తుందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా, డీప్-టెక్ భవిష్యత్తుకు స్వాగతం పలికేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్నోవేషన్-ఫస్ట్ దృక్పథాన్ని ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.
డిస్‌రప్టివ్ ఏఐ మోడల్స్, అటానమస్ ఏజెంట్‌లు, క్వాంటమ్ టెక్నాలజీలు, అధునాతన సెన్సార్ ప్లాట్‌ఫామ్‌లు, సూపర్‌హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వచించబడే తదుపరి ఇన్నోవేషన్ యుగంలోకి ప్రవేశిస్తున్నామని, ఈ కీలక సమయంలో టీఏఐహెచ్ ను ప్రారంభించడం ద్వారా తెలంగాణ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసి, ప్రపంచంలోని టాప్ 20 ఇన్నోవేషన్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలపడం తమ లక్ష్యమని టీఏఐహెచ్ సీఈఓ ఫణి నాగార్జున చెప్పారు. కార్యక్రమ వివరాలు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అధికారిక ప్రారంభం ఈ నెల 20న సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు, దావోస్‌లోని మౌంటెన్ ప్లాజా హోటల్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాధినేతలు, పరిశ్రమల అధినేతలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. టీఏఐహెచ్ అనేది కృత్రిమ మేధస్సులో ఇన్నోవేషన్, పరిశోధన, అమలును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలకు మధ్య వారధిగా పనిచేస్తూ, జనాభా స్థాయిలో గ్లోబల్ సవాళ్లకు పరిష్కారాలు అందిస్తుంది. టీఏఐహెచ్ నాలుగు వ్యూహాత్మక స్థంభాలపై పనిచేస్తుంది—టాలెంట్ ఫౌండ్రీ, ఇన్నోవేషన్ ఇంజిన్, క్యాపిటల్ ఫ్లైవీల్, ఇంపాక్ట్ ల్యాబ్స్—నైపుణ్యాలు, పరిశోధన నుంచి స్టార్టప్‌లు, మూలధనం, వాస్తవ ప్రపంచ అమలు వరకు నిరాటంక ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




