– మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం
– విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు
– ఐస్‌బీలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: తెలంగాణ రైజింగ్-2047, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్‌కు శుక్రవారం ప్రారంభోత్సవం చేసి అనంతరం ప్రసంగించారు. యువ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ఐఎస్‌బీ విద్యార్థులు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ఎవరూ ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతోందని, ఈ పెట్టుబడి రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా భావిస్తున్నదని వివరించారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లగానే ఉద్యోగం పొందేలా ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాన్ని చైర్మన్‌గా నియమించి స్కిల్ యూనివర్సిటీ చేసినట్లు తెలిపారు. ఐఎస్‌బి నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శించి సలహాలు, సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. ఐఎస్‌బి విద్యార్థులు గొప్ప అదృష్టవంతులని, ఒక్కో తరగతి గది రూ.1.50 కోట్ల పైనే వెచ్చించి నిర్మించారుని, తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సింగిల్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానంటూ రాసుకునేందుకు పలకలు కూడా లేక తమ గురువులు ఇసుకపైనే అక్షరాలు దిద్దించిన సందర్భాన్ని భట్టి గుర్తు చేశారు. గురుపూజ దినోత్సవం రోజు ఐఎస్‌బి వంటి గొప్ప విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. తాను ఈ స్థానానికి రావడానికి కృషి చేసిన గురువర్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్‌బీలో ఆశయాలు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు గౌరవంగా, సంతోషంగా ఉందని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అనేది అక్షరాభ్యాసం కాదు.. అది నమ్మకానికి పదును పెట్టడం, ప్రతిసారీ నేర్చుకుంటూ అమలు చేసే చక్రాన్ని ఆపకుండా ఉంచడం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్‌బీని ఒక విద్యాసంస్థగా కాదు, భాగస్వామిగా చూస్తుందని తెలిపారు. ముఖ్యంగా సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్ మాతో కలిసి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వామ్యం అవుతోంది.. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు మా ప్రయాణం.. విధానాన్ని హామీగా, హామీని పురోగతిగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాం’ అని డిప్యూటీ సీఎం వివరించారు. ఇవాళ మనం విఘాతం (సఱంతీబజ్‌ూఱశీఅ) సాధారణమైన కాలంలో జీవిస్తున్నాం.. ప్రభుత్వం విధానాన్ని, దృష్టిని ఇస్తుంది.. పరిశ్రమ వనరులు, అమలు ఇస్తుంది.. విద్యాసంస్థలు జ్ఞానం, పరిశోధన ఇస్తాయి, ఈ మూడూ కలిసినపుడే నిజమైన పరివర్తన సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. అందుకే ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ సెంటర్ క్లాస్ రూమ్‌లు, బోర్డు రూమ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు కలిసే ఒక కుళాయిలా మారి, ఆలోచనలను పరిష్కారాలుగా మలిచే స్థలం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంలో సహకారం అనే కొత్త యుగాన్ని కూడా ప్రారంభిద్దామన్నారు. రాష్ట్రం, విద్యాసంస్థలు, పరిశ్రమ కలిసి భారతదేశ భవిష్యత్తును మలిచే మార్గంలో పయనిద్దాం అని పిలుపునిచ్చారు. నేర్చుకోవడం ఎప్పటికీ ముగియదని, తాను కూడా ఐఎస్‌బిలో విద్యార్థిగా అడ్మిషన్ తీసుకోవాలని భావిస్తున్నానని ఐఎస్‌బీ డీన్ మదన్ గమనించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎస్‌బీలో ఐదు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని నిర్వాహకులను డిప్యూటీ సీఎం కోరారు. కార్యక్రమంలో మోతీలాల్ ఓస్వాల్ డీన్ మదన్ పిల్లుట్ల, ప్రభాత్ సిన్హా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





