కవితపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

– ఆమె మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి
– మండలి ఛైర్మన్‌ ‌గుత్తాకు తీన్మార్‌ ‌మల్లన్న వినతిపత్రం
హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న సమర్థించుకున్నారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని.. ఆ పుస్తకానికి ముందుమాట రాసింది కేసీఆరేనని గుర్తుచేశారు. ఆ పుస్తకంలో ‘మంచం పొత్తు – కంచం పొత్తు’ అని ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని ఉద్ఘాటించారు తీన్మార్‌ ‌మల్లన్న. ఏ పదాలు వాడాలి, ఏ పదం వాడకూడదనేది తనకు తెలుసునని నొక్కిచెప్పారు. ‘కంచం పొత్తు – మంచం పొత్తు’ అంటే బీసీల భాషలో వియ్యం పొత్తు అనే అర్థం వస్తోందని గుర్తుచేశారు. వాళ్ల భాషలో ’మంచం పొత్తు’ అంటే ఏంటో తనకు తెలియదని విమర్శించారు. సోమవారం శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డిని తీన్మార్‌ ‌మల్లన్న కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని తీన్మార్‌ ‌మల్లన్న ధ్వ‌జమెత్తారు.దొరసానికి బీసీల భాష ఏం తెలుసని కవితని పరోక్షంగా విమర్శించారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కవిత మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కవితపై విచారణ చేస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కవిత బీసీ వాదంపై దాడి చేస్తోందని ఆక్షేపించారు. కవితకి అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కవిత చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్‌ ‌కాదా అని తీన్మార్‌ ‌మల్లన్న ప్రశ్నల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *