– బాలికల్లో కౌమార దశ అత్యంత సంక్షిష్టమైనది
– సరైన మార్గం చూపితే సమాజ మార్దదర్శకులవుతారు
– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా 14 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు దశ అత్యంత సంక్లిష్టమైనదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇది జీవితాన్ని మలుపు తిప్పే దశ అని, ఈ సమయంలో సరైన దారి చూపితే బాలిక సమాజ మార్గదర్శకురాలవుతుందని అన్నారు. ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై సెర్ప్, మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ కౌమార దశలో బాలికలు బాల్య వివాహాలు, చదువును ఆపేయడం, రక్తహీనత, పోషకార లోపం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటారని తెలిపారు. ఈ సమస్యలు బాలిక ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని, అందుకే మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కిశోర బాలికల భద్రత, పోషకాహారం, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కావాలంటే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటుతోనే సాధ్యమనని మంత్రి చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటులో డీఆర్‌డీవో, డీడబ్ల్యువోలు కలిసి పనిచేయాలని, బాలికల సమస్యలు తెలుసుకుని అవగాహన కార్యక్రమాలు చేసే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు కిశోర బాలిక సంఘాలను అనుసంధానం చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీలు అన్ని వ్యాపారాల్లో రాణిస్తున్నారని, ఆర్థిక స్వావలంబనతోపాటు సామాజిక భద్రతను పొందగలుగుతున్నారని, కిశోర బాలిక సంఘాలను బలోపేతం చేస్తే వారి సమస్యలన్నీ సమసిపోతాయని మంత్రి సీతక్క చెప్పారు. పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో బాలికలు సమస్యలు వేరువేరుగా ఉంటాయని, సమస్యలనుబట్టి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కిశోర బాలికల్లో నైపుణ్యం పెంపొందించే దిశలో అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామాలవారీగా కిశోర బాలిక సంఘాలను ఏర్పాటు చేసి వారు ఎదుర్కొనే సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించాలని సీతక్క అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, అడిషనల్ సీఈఓ కాత్యాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి.సృజన, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, కౌమార అండ్ యువజన అభివృద్ధి అధికారి ఎం.మురళీకృష్ణ, తరుణి సంస్థ చైర్ పర్సన్ మమత రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





