– రైతుల అభివృద్ధిలో తోడుగా ప్రజా ప్రభుత్వం
– నాబార్డుతో ముడిపడి ఉన్న గ్రామీణ భారతం
– 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను నెలకొల్పుతాం
– నాబార్డు ధరిత్రీ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: సంక్షోభ సమయాల్లోనే కాదు, రైతుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్రభుత్వం తోడుగా ఉంటోందని, ఇది మా నిబద్ధత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సాగునీరు, డిజిటల్ పంట రికార్డులు, కోత తర్వాతి మౌలిక వసతులలో పెట్టుబడులతో గ్రామీణ కుటుంబాల్లో బలమైన నమ్మకాన్ని పునరుద్ధరించామని గుర్తుచేశారు . మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన నాబార్డ్ మొదటి ధరిత్రీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ముందుకెళ్తోందంటూ దేశంలోనే అతి పెద్ద రుణ మాఫీలలో ఒకదాన్ని అమలు చేసి దాదాపు 22 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్ల ఉపశమనం కలిగించామన్నారు. కొనుగోలు వ్యవస్థను విస్తరించి పారదర్శకంగా మార్చామని, రైతులకు నేరుగా, సమయానుసారం రైతు భరోసా అందజేస్తున్నామని వివరించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ ధరిత్రీ సదస్సులో పాల్గొనడం తనకు లభించిన గొప్ప గౌరవమని అన్నారు. ఈ సమ్మిట్ పేరు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుందంటూ దేశ బలం చివరకు దాని నేలలోనే ఉంది.. దాని గ్రామాలలో ఉంది.. మన రైతుల్లో ఉంది.. ప్రతికూలతను సమృద్ధిగా మార్చే వారి నిశ్శబ్ద ధైర్యంలో ఉంది అని భట్టి చెప్పారు. ఈ జాతీయ కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభం కావడం చాలా సముచితమంటూ నాబార్డుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థాగత విప్లవం లేకుండా ఏ గ్రీన్ రివల్యూషన్ కూడా సాధ్యం కాదని గుర్తు చేసుకోవాలని, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న నాయకులు మన దేశానికి లభించటం ఒక వరం అని పేర్కొన్నారు. ‘మిగతావన్నీ ఆగొచ్చు.. వ్యవసాయం ఆగకూడదు’ అనే నమ్మకంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాగునీటి సంఘాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు వంటి సంస్థాగత నిర్మాణాల్ని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సృష్టించారని తెలిపారు. ఇందిరా గాంధీ ముఖ్యంగా గ్రీన్ రివల్యూషన్ కాలంలో ఆమె చూపిన ధైర్యం రైతుకు భారత ప్రభుత్వ సంపూర్ణ అండ లభించేలా చేసిందన్నారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్, గ్రామీణ ఆరోగ్య వసతులు, ఎస్‌హెచ్‌జీలకు మద్దతు వంటి రైతు-కేంద్రీకృత సంక్షేమ నమూనాను అమలు చేశారన్నారు. పీఏసీఎస్‌ల ఆధునికీకరణ, సహకార సంస్థల బలోపేతం, వ్యవసాయ డిజిటలైజేషన్, ఎఫ్‌పీవోలకు సుస్థిర శక్తి ఇవ్వడం ద్వారా గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని భట్టి అభివర్ణించారు. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం కేవలం ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు ఇన్నోవేషన్ సంకల్పంతో కలిసినప్పుడు గ్రామీణ మార్పు ఎలా సాధ్యమవుతుందో సజీవ సాక్ష్యం కూడా అన్నారు.
ప్రతీ గ్రామాన్ని కలుపుతున్న టీ-ఫైబర్
గ్రామీణ భారతానికి డిజిటల్ హైవేల విషయానికొస్తే టీ-ఫైబర్ ద్వారా 43,000 కి.మీ.కుపైగా డిజిటల్ వెన్నెముక మాదిరిగా దాదాపు ప్రతి గ్రామ పంచాయతీని కలుపుతోందన్నారు. ఇది కేవలం బ్రాడ్‌బాండ్ కాదు.. డిజిటల్ గౌరవం అన్నారు. టెలి మెడిసిన్, రిమోట్ విద్య, ఈ-కామర్స్, ఆధునిక వ్యవసాయానికి ఇది శక్తిగా నిలుస్తోందని తెలిపారు. స్మార్ట్ వ్యవసాయం విషయానికొస్తే పల్లెల్లో నీటిని ఆదా చేసే పద్ధతులతో, పొలాల్లో కార్బన్ తగ్గించే చర్యలతో దేశంలోనే మొదటి గోల్డ్ స్టాండర్డ్ కార్బన్ క్రెడిట్స్‌ను రైతులకు అందించిందనీ చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో మహిళల ఎస్‌హెచ్‌జీల సౌర వ్యాపారులుగా మారుతున్నారన్నారు. “సార్.. మునుపు వాన కోసం ప్రార్థించేవాళ్లం. ఇప్పుడు సూర్యకాంతి కోసం కూడా ప్రార్థిస్తాం! ” అదే నిజమైన సాధికారత అన్నారు.
గ్రామీణ ఫైనాన్స్ అండ్ ఫిన్‌టెక్
గ్రామీణ ఫైనాన్స్ అండ్ ఫిన్‌టెక్ విషయానికొస్తే డిజిటల్ క్రెడిట్, మొబైల్ పేమెంట్స్, పంట నుండి మార్కెట్ వరకు ట్రేసబిలిటీ వంటి వాటిని ఏకీకృతం చేస్తున్నామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పాలసీలో 100 కోట్లు ‘యంత్రం ఫండ్’, ఎస్‌సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు, ప్రత్యేక కొనుగోలు రిజర్వేషన్లు ఉన్నాయని వివరించారు. భవిష్యత్ నైపుణ్యాల్లో అగ్రిటెక్, ఫిన్‌టెక్ పునరుత్పాదక శక్తి రంగాల్లో స్కిల్ సెంటర్లు 2026 నాటికి మూడు లక్షల మంది యువతను నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. గ్రామీణ సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్తు రంగం 2030 నాటికి 30% పునరుత్పాదక శక్తి లక్ష్యంగా రూఫ్‌టాప్ సోలార్, సోలార్ పంపులు, గ్రీన్ హైడ్రోజన్ పైలట్లు, సమాజ ఆధారిత ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. నాబార్డ్ ఇప్పుడు కేవలం వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం కాదు.. భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మలుస్తోంది అని డిప్యూటీ సీఎం చెప్పారు. ఓఎన్‌డీసీ ద్వారా గ్రామీణ ఉత్పత్తిదారుల్ని డిజిటల్ మార్కెట్‌కు కలపడం, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు మద్దతు, హైదరాబాద్‌లోని ఏకలవ్య ఫౌండేషన్ వంటి సంస్థలను ఆదివాసీ సాధికారత కోసం ఆదరించడం.. గ్రామీణ భారత్ మహోత్సవం వంటి జాతీయ ప్రదర్శనలు నిర్వహించడం.. గ్రామీణ ఉత్పత్తులకు ‘గ్రామీణ ట్యాగ్’ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలో మనం నిర్మిస్తున్న ప్రతిదీ డిజిటల్ మౌలిక వసతులు, అగ్రిటెక్, ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, ఇన్క్యుబేషన్.. ఇవి అన్నీ ఒకే దృష్టి వైపు సాగుతున్నాయి. డ్రోన్ల ఆధారిత పంట నిర్వహణ, ఏఐ మట్టి విశ్లేషణ, డిజిటల్ ఎఫ్‌పీవో ప్లాట్‌ఫారమ్‌లు ఇవి. భారత్ ఆహార భద్రత, వాతావరణ ప్రతిఘటనలో ప్రపంచాన్ని నడిపించాలంటే ఇవి అవసరం అని పేర్కొన్నారు. పారంపర్యం, ఇన్నోవేషన్ కలిసి నడిచే నగరం ఇది అని వివరించారు. నాబార్డ్.. గ్రామీణ భారతానికి ఎప్పుడూ భాగస్వామి, మార్గదర్శి.. కొన్నిసార్లు నిశ్శబ్దంగా కాపాడే దేవదూత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నాబార్డ్‌తో లబ్ధిదారుగా కాదు.. నిజమైన సహచరుడిగా కలిసి పనిచేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదు.. అది దేశపు మొదటి ఆత్మ అని అభివర్ణించారు. సాంకేతికత ఈ ఆత్మకు శత్రువు కాదు.. మిత్రుడు. నాబార్డ్ వంటి సంస్థలు దాని రక్షకులు అన్నారు. భారత భవిష్యత్తుపై అపార విశ్వాసంతో చేయిచేయి కలిపి ముందుకు నడుద్దాం అని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డ్ చైర్మన్ షాజీ, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





