– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: పీఆర్‌సీి గడువు పూర్తయి రెండేళ్లు గడిచినా నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.లక్షల్లో నష్టం జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ నివేదికను తెప్పించి 2023 జూలై 1 నుండి వర్తించేలా అమలుపరచాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ఇటీవల జరిగిన పదోన్నతులలో విధుల్లో చేరకుండా మిగిలిన పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులతో వెంటనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 2010 కంటే ముందే నియామకమై పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై అయిన వారే ప్రమోషన్స్‌కి, ఉద్యోగంలో కొనసాగడానికి అర్హులని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనలకు దారి తీసిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. ప్రభుత్వమే ఖర్చు భరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను వేసవి సెలవుల్లోనే నిర్వహించాలని, విద్యేతర, ఆన్‌లైన్ కార్యక్రమాలు తగ్గించాలని ఆయన కోరారు. బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదికి దూరం అవుతున్నారని, తద్వారా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో స్వచ్ఛంద సంస్థల జోక్యం తగ్గించాలన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం.గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్స్, ఎంఈఓలు, డిప్యూటీ డీఈవోలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని, తద్వారా పర్యవేక్షక వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బి.ఆంజనీదేవి, ఎస్.సుమ, డాక్టర్ కిషన్, ఎ.మల్లయ్య, డి.రమేష్‌లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





