నడుములోతు కంకరలో కూరుకుపోయిన టీచర్‌

– బ‌స్సు ప్ర‌మాదంలో విషాద గాథ‌లు ఎన్నెన్నో

రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3:  బ‌స్సు ప్ర‌మాదంలో విషాద గాథ‌లు ఎన్నెన్నో. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొన‌గా కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతిచెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. తోలకట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ ‌కాంట్రాక్ట్ ‌టీచర్‌గా పనిచేస్తున్న జయసుధతోపాటు మరికొందరు నడుములోతు కంకరలో ఇరుక్కుని బయటకు రాలేకపోయారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కారు. ఆమెతోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులూ అదే బస్సులో రావాల్సింది. వారు బయల్దేరడం ఆలస్యం కావడంతో వేరే బస్సులో వచ్చి ప్రమాదం నుంచి బయటపడ్డారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు నిమ్స్‌కు తరలించారు.

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు

రోడ్డు ప్రమాదం  ఇద్దరు చిన్నారులకు తల్లిద్రండులను దూరం చేసి అనాథలుగా మిగిల్చింది. ఈ ప్రమాదంలో వికారాబాద్‌ ‌జిల్లా యాలాల్‌ ‌మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బండప్ప, లక్ష్మి మృతి చెందారు. దీంతో వారి కుమార్తెలు భవాని, శివలీల ఒంటరిగా మిగిలిపోయారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఓ బాలుడి తల్లి చనిపోగా తండ్రికి గాయాలయ్యాయి. బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గచ్చిబౌలిలో చదువుకుంటున్న ఓ యువతి ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వొచ్చిందని, తిరిగి వెళ్లేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు.

ప్రమాదం నుంచి బయపడ్డ యువకుడు
బస్సు ప్రమాదంలో తాండూరు మండలం గౌతపూర్‌కు చెందిన బాలప్పొల్ల వినయ్‌ ‌కుమార్‌(30) అనే యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వినయ్‌కుమార్‌ ‌హైదరాబాద్‌ ‌సన్‌ ‌సిటీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లాడు. సోమవారం విధులకు హాజరయ్యేందుకు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. డ్రైవర్‌ ‌వెనుక భాగంలోని ఆరో సీట్లో కూర్చున్నాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఆయన.. అప్రమత్తమై కిటికీలోంచి బయటకు దిగినట్లు చెప్పారు. తన ముందు సీట్లో కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు, పక్కన కూర్చున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించాడు. యువకుడు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *