– కేంద్ర మంత్రి కట్టర్‌ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి
న్యూదిల్లీ, ఆగస్టు 7: టీజీఎస్ ట్రాన్స్‌కో సంస్థ గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) దశ-3 కింద సమర్పించిన రాష్ట్రాంతర విద్యుత్ ప్రసరణ వ్యవస్థ ప్రతిపాదనలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను ధిల్లీిలో గురువారం కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. జీఈసీ- 3 దశలో సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) మొదట రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మొత్తం 13.5 గిగావాట్ల సామర్థ్యపు గ్రీన్ పవర్ (ఆర్‌ఈ) జోన్‌లను గుర్తించిందని, వీటి ద్వారా విండ్, సోలార్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఎగుమతి చేయాల్సి ఉంటుందనీ తెలిపారు. ఎస్‌ఈసీఐ, టీజీరెడ్కోలతో విస్తృతంగా చర్చించిన అనంతరం భూమి లభ్యత, పునర్వినియోగ విద్యుత్ సాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆర్‌ఈ జోన్‌ల సామర్థ్యం 19 గిగావాట్లకు పెంచినట్లు వివరించారు. ఇది రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తుందన్నారు. ఈ సవరణకు అనుగుణంగా టీజీ ట్రాన్స్‌కో మొత్తం 19 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన 8 ట్రాన్స్‌మిషన్ పథకాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనను తయారు చేసి దాని అంచనా వ్యయం రూ.6,895 కోట్లుగా పేర్కొంటూ కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థకు సమర్పించిందని భట్టి వివరించారు. ఈ నేపథ్యంలో టీజీ ట్రాన్స్‌కో సంస్థ సమర్పించిన ఈ 8 పథకాల (జిల్లాల) ద్వారా 19 గిగావాట్ల విద్యుత్ నికాసానికి సంబంధించిన ప్రతిపాదనను వీలైనంత త్వరగా ఆమోదించాల్సిందిగా కోరారు. ఇది రాష్ట్రంలో గ్రీన్ పవర్ అభివృద్ధిని, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.





