– సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె.నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్ జింకలవాడ వద్ద ఉన్న మెసర్స్ ఎస్.పి.ఆర్ చికెన్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, చికెన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఇందుకు సంబంధించి సూరజ్ పాల్ (66), అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉండే పాల్ చికెన్ హోల్ సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోల్డ్ స్టోరేజ్ సెంటర్ నుంచి సుమారు 352 కిలోల గడ్డకట్టిన కుళ్ళిన చికెన్ స్వాధీనం
చేసుకున్నారు. అందులో రెక్కలు, చెస్ట్, లివర్, గిజార్డ్ వంటి భాగాలు ఉన్నాయి. చికెన్ నిల్వ ఉంచిన ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు పోలీసులు గుర్తిం చారు. ఎఫ్ఎస్ఎస్ ఏఐలైసెన్స్ గడువు ముగిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్నారు. ఈ మాంసం తినడానికి యోగ్యమైనది కాదని తెలిపారు. హెచ్-ఫాస్ట్ బృందం స్వాధీనం చేసుకున్న మాంసాన్ని, నిందితుడిని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్.ఓకు అప్పగించారు. ఈ ఆపరేషన్ లో హెచ్-ఫాస్ట్ ఇన్స్పెక్టర్, సిబ్బంది, సనత్ నగర్ పోలీసులు పాల్గొన్నారు. ఆహార పదార్థాలను కేవలం లైసెన్స్ ఉన్న పరిశుభ్రమైన కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. గుర్తింపు లేని విక్రేతల వద్ద ఆహారాన్ని తీసుకోవద్దని చెప్పారు. ఎక్కడైనా అపరిశుభ్రమైన లేదా అనుమానాస్పద ఆహార తయారీ పద్ధతులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రజల సహకారం ఎంతో అవసరం అని ఈ సందర్భంగా అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



