ప్రాజెక్ట్స్‌ పనుల పురోగతి సమీక్షకే టాస్క్‌ఫోర్సు

– ఆయా అంశాలపై అధికారులు తక్షణం స్పందించాలి
– అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి
– రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారం
– రాజకీయాలు కాదు రాష్ట్రాభివృద్దే ముఖ్యం
– త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం
– సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: రాష్ట్రంలో మంచి రోడ్‌ నెట్‌వర్క్‌ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అండ్‌ ఎంవోఆర్‌టీహెచ్‌ ప్రాజెక్ట్స్‌ పనులు వేగంగా పూర్తి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సరైన ప్రణాళికలతో వెళ్లేందుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్‌ లైన్‌ షిఫ్టింగ్‌, వాటర్‌ యుటిలిటీ క్లియరెన్స్‌, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా మంత్రి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి వరంగల్‌-ఖమ్మం సెక్షన్‌లో ఎన్‌హెచ్‌-163 పరిధిలోని ప్యాకేజీ 2లో చెరువుల అంశాన్ని మంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో ఎన్‌హెచ్‌ అధికారులు వివరించారు. మహబూబాబాద్‌, నెల్లికుదురు ప్రాంతంలో చెరువుల సమస్యలు ,దాంతోపాటు హై లెవల్‌ బ్రిడ్జి ప్రపోజల్స్‌పై వివరించారు. ఇరిగేషన్‌ శాఖ నుండి ఎన్‌వోసీ రావాల్సి ఉందన్నారు. ఎన్‌హెచ్‌ 30 సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు రోడ్డుతోపాటు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు సంబంధించి పలు సమస్యలు మంత్రి దృష్టికి తెచ్చారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో మాట్లాడి ఇరిగేషన్‌ శాఖ ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఫారెస్ట్‌ క్లియరెన్స్‌కు సంబంధించిన అంశాలు ప్రధానంగా మంత్రి దృష్టికి తెచ్చారు. ఫారెస్ట్‌ అధికారులు క్లియరెన్స్‌ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కల్వకుర్తి-శ్రీశైలం 62 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్‌కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా ఉన్నారనీ, ఫారెస్ట్‌ అధికారులు అందుకు తగ్గట్టుగా సమన్వయంతో పనిచేస్తే గొప్ప ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన వారమవుతామన్నారు. విద్యుత్‌కు సంబంధించి 220కెవి,400కెవి లైన్‌ సమస్యలతోపాటు, 33కెవి,1 1కెవి లైన్‌ షిఫ్టింగ్‌ సమస్యలున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏయే ప్రాంతంలో ఏ సమస్య ఉందో వివరాలు ఇవ్వాలంటూ వాటిని పరిష్కరించేందుకు విద్యుత్‌ శాఖ అధికారి ముషారఫ్‌ ఆలీకి బాధ్యతలు అప్పగించారు. మైనింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ నుండి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా పనులు వెంటనే క్లియర్‌ చేసేలా చొరవ తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారి శ్రీధర్‌కు సూచించారు. ప్రధానంగా భూసేకరణలో భాగంగా రెవెన్యూ కు సంబంధించిన అంశాలే ఎక్కువ ఉన్నాయని వాటిని వెంట వెంటనే పరిష్కరించేందుకు సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌ కృషి చేయాలన్నారు. ఇకపై తరచుగా భేటి అవుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేద్దామన్నారు. టి ఆర్‌ అండ్‌ బి స్పెషల్‌ సిఎస్‌ వికాస్‌ రాజ్‌ సూచనల మేరకు ఈనెల 18న మరోమారు భేటీ అవుదామని, ఆయా జిల్లా కలెక్టర్లు హాజరయ్యేలా చూడాలని మంత్రి చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారమణి, రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలానే చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉన్న చిన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. తమకు రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్దే ముఖ్యమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రాజెక్టుల క్లియరెన్స్‌ కోసం త్వరలో ప్రధాని మోదీని కలుస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *