– ‘ఇక చాలు’ నినాదంతో ముందడుగు
– లింగ వివక్షపై పోరాడుతున్న బాలికా సంఘాలు
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు
– బాలికల హక్కుల కోసం పని చేస్తా: వెన్నెల గద్దర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: బాలికలు ఇళ్ళల్లో, సమాజంలో,పాఠశాలలో తాము ఎదుర్కునే వివక్షత అనుభవాలను పంచుకునేందుకు, కుటుంబ సభ్యుల ఉపాధ్యాయుల కమ్యూనిటీ దృక్పథాలలో లింగ సమానత్వం పై మార్పులు ఎలా తీసుకురావచ్చో ఆలోచన చేసే సురక్షిత మైన వేదిక నే “తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య”. ఈ వేదికలో ఉన్న బాలికలు పరస్పర శక్తి పొందుతూ వారు ఇంతకు ముందెన్నడూ చూడని బహిరంగ ప్రదేశాలలోకి ప్రవేశించడం ప్రారంభించారు. తద్వారా వారి చలన స్వేచ్చను ప్రకటించుకుంటున్నారు. సమాజంలో బాలికల పట్ల వివిధ రకాల వివక్షతలను ఎదురించడానికి బాలికలు రాజ్యంగ హక్కులకు అనుగుణంగా నూతన సామాజిక నియమాలను ఎర్పరచాలని బాలికల పట్ల వివక్షత ఇంకే మాత్రం సహించమని రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్, గద్వాల్, హైదరాబాద్ జిల్లాలలోని బాలికా సంఘాల సభ్యులు నిరూపించారు. బాలికలు చేస్తున్న పోరాటంతో పాటు ‘బాలల హక్కుల పరిరక్షణ వేదిక’లు, ‘గ్రామ పంచాయతీ’లు, ‘మహిళా గ్రూపులు’, ‘యువజన కార్యకర్తలు’, బాల్యవివాహాలను ఎదిరించి, వాటిని అడ్డుకున్నారు. బస్టాపులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఆడపిల్లల్ని వేధించే ఆకతాయిలను మందలించారు, అదుపు చేశారు. ఇలాంటి వారిలో చాలా మంది బాలికలకు అండగా, స్త్రీ పురుషుల సమానత్వం కోసం పోరాడటానికి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. బాలికలను గౌరవిస్తూ వారి విద్యాభివృద్ధి కోసం జరుగుతున్న ఉద్యమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, పురుషులు, పోలీసులు భాగస్వాములయ్యారు. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘స్నేహ హస్తం’ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల తరహాలో కిశోరబాలికల బృందాలను ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పని చేయాలని నిర్ణయించడం శుభ పరిణామం. ఈ మార్పు కోసమే బాలికలు ఎదురుచూస్తున్నారు. వాళ్ళ గురించి చర్చ జరుగుతోందని, వారి అభ్యున్నతి గురించి సమాజం ఆలోచిస్తోందని తెలిశాక, వారు సమాజంలో తమ స్థానం కోసం, సమానత్వం కోసం మరింత ఉత్సాహంతో పోరాడుతున్నారు. బాలకార్మికతకు వ్యతిరేకంగా గళం విప్పి, బడికి పొతామని పట్టుబడుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక పెద్దలను ఎదిరించి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తమ హక్కులను చాటుకుంటున్నారు. వివిధ గ్రామాలలో స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి జాతీయ పండుగలలో జెండాలను ఎగరేశారు. మామూలుగా జెండా పండుగలు పురుష యువజన సంఘాలు చేసుకునే ఆనవాయితీని మార్చేశారు. వాస్తవానికి, పితృస్వామ్యం నుంచి, లింగ వివక్ష నుంచి. బైట పడాలన్న వారి పట్టుదల, అధికార వ్యవస్థలకు వారు దీటుగా నిలబడిన తీరు చాలా స్ఫూర్తిదాయకం. ఈ నేపధ్యంలో గ్రామంలో ఉన్న ఆడపిల్లలు అందరూ కలిసి కమిటీలు ఏర్పరచుకుని ‘ఇక చాలు’ నినాదంతో గ్రామ గ్రామాన సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. ప్రతి కమిటీలో 10 నుండి 15 మంది ఆడపిల్లలు సభ్యులుగా ఉంటారు. ఆడపిల్లల పట్ల వివక్షతను ఎదురుకోవడానికి తగు శిక్షణలు పొంది అధికారులతో, గ్రామ సర్పంచులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కార మార్గాల వైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ సంస్థ ప్రకటించిన రాజిలేని సూత్రాలు పౌరులకు రాజ్యంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ఉన్నాయి.
ఆడపిల్లల హక్కుల సాధనకు సూత్రాలు
పిల్లలందరూ 18 సంవత్సరాల వరకు పూర్తికాలం విద్యా సంస్థలలోనే ఉండాలని, విద్యను అభ్యసించడంలో సామర్ధ్యాలు అందుకోవడంలో బాలికలు బాలురకు సమాన అవకాశాలు ఉండాలని, ఒకటవ తరగతి నుండే జెండర్ సమానత్వంపై చర్చ మరియు పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని, బాలికల స్వతంత్రతను నియంత్రించే ఏ వాదనలనైనా తిరస్కరించాలని, జెండర్, కులం, మతం, అంగవైకల్యం లాంటి వివక్షలు లేకుండా అన్ని సామాజిక స్థలాలు బాల బాలికలకు సమానంగా అందుబాటులో ఉండాలని, లింగ బేదం ఆధారంగా యువజన సంఘాలు ఉండరాదని, 18 సంవత్సరాలు నిండకుండా ఏ అమ్మాయికి పెళ్లి చేయరాదని ఒక వేళ జరిగితే అటువంటి పెళ్లిళ్లను రద్దు చేస్తూ ‘బాల్య వివాహ నిషేధ చట్టం’2006 ను సవరించాలని రాజీలేని సూత్రాలతో ఈ సంఘ సభ్యులు పనిచేస్తున్నారు. పాఠశాలలో ఆడపిల్లల పట్ల వివక్షత ఏ రూపంలో ఉన్నా సహించకుండా వెంటనే ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. అది స్కూల్ లో టీచర్లు ఆడపిల్లలకు చెప్పే పనులకు మగ పిల్లలకు చెప్పే పనులలో వివక్షత ను టీచర్లతో నిర్భయంగా చర్చిస్తారు. అలాగే పాఠ్యపుస్తకాలలో ఉన్న బొమ్మలు లింగ వివక్షతతో కూడినవిగా ఉంటే విద్యా శాఖ దృష్టికి తీసుకెళతారు. ఉదాహరణకు టెక్స్ట్ బుక్స్ అత్యధిక శాతం పురుష రచయితల తో తయారు చేయడం సరికాదని, మహిళలకు సమాన అవకాశాలు ఆన్ని స్థాయిలో కల్పించాలని అధికారులతో చర్చిస్తారు. అంతే కాకుండా మహిళా టీచర్లకు అప్పగించే బాధ్యతలలో తేడాలు కనిపిస్తే కూడా జెండర్ కమిటీలలో చర్చించుకుంటారు.
తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య’(టాస్)
‘ఇక చాలు’ అనే నినాదంతో టాస్ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని వివిధ ప్రాంతాల ఆడపిల్లలు కనపరుస్తున్న ఆసక్తితో కొత్త మండలాలకు విస్తరించింది. నవంబర్ 22న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశం బాలికల హక్కుల కు మద్దతు నిలవాలని ఈ క్రింది డిమాండ్ల తో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
• విద్య కు రాష్ట్ర బడ్జెట్ లో 15 శాతం నిధులను కేటాయించాలి.
• బాలికల వికాసం కోసం స్పష్టమైన విద్యా లక్ష్యాలు నిర్దేశించాలి.
• కళ్యాణ లక్ష్మి పథకం బదులుగా ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరచాలి,
• పిల్లలందరికీ ఉచిత రవాణ సౌకర్యాలు కల్పించాలి.
• పాఠాశాలల్లో జూనియర్ కాలేజీలలో అవసరం ఉన్న టీచర్లను నియమించాలి,
• నిలిపివేసిన స్కాలర్షిప్స్ వెంటనే అందించాలి,
• ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కాలేజీ లు అందరికి అందుబాటులోకి తేవాలి,
• కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్ విద్యలో అన్ని గ్రూపులు అందుబాటులోకి తేవాలి.
• పిల్లలకు కావలసిన కులం, ఆదాయం, ఆధార్, పుట్టిన తేది లాంటి సర్టిఫికెట్లు అన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి ఇచ్చే విధంగా చూడాలి.
• ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో పూర్వ ప్రాథమిక మరియు ఇంటర్మీడియట్ కోర్సులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.
• ఉన్నత విద్య, డిగ్రీ చదివే పిల్లలకు ప్రభుత్వం హాస్టల్ వసతి కల్పించాలి,
• మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ వరకు కొనసాగించాలి.
చివరగా బాలికలకు అండగా నిలవడం లాంఛనప్రాయం కాదని, దానికి బలమైన నిబద్దత మరియు నైతికతతో కూడిన రాజకీయ చర్య అవసరమని ప్రభుత్వాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. లింగ వివక్షను వ్యతిరేకించడం, సమానత్వాన్ని సమర్ధించడాన్ని అధికార సంబంధాల పరిష్కార ప్రక్రియలో భాగంగా చూడాలి. అందుకు గాను బాలికల హక్కులకు విలువనిచ్చి వారికి అండగా నిలిచే వ్యవస్థలు, సంస్థలను ఏర్పాటు చేసిన నాడే సమానత్వం కోసం, న్యాయం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం, నూతన సామాజిక నియమాల మార్పు కోసం బాలికలు చేస్తున్న ఉద్యమానికి స్పందించినట్లు అవుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



