– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
– తదుపరి తమ టార్గెట్ క్యూబా అంటూ హెచ్చరిక
వాషింగ్టన్, మార్చి 28: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ దేశంలో నాయకత్వం లేకుండా పోయిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలోని మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ప్రయారిటీ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా కార్యకలాపాల వల్ల ఇరాన్ బలహీనపడిందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్మూలించడంలో అమెరికా దళాలు అంచనాలకు మించి పనిచేశాయని ఆయన అన్నారు. ’ఇరాన్ నౌకాదళం అంతమైపోయింది. అదంతా అఖాతపు అడుగున మునిగిపోయింది.. వారి వైమానిక దళం పూర్తిగా, సమూలంగా నాశనమైంది. వారి విమాన నిరోధక, సమాచార ప్రసార సామర్థ్యాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అంతేకాదు, ఇరాన్ నాయకత్వం, సైనిక శక్తి కూడా నాశనమైంది. వారి నాయకులందరూ చనిపోయారు.. వారి సుప్రీం లీడర్ ఇక సర్వోన్నతుడు కాదు. ఆయన మరణించారని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఆయుధ నిల్వలను తాము చిన్నాభిన్నం చేస్తున్నామని, ఎవరూ ఊహించని స్థాయిలో వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలను ధ్వంసం చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. వారి రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని తుడిచిపెట్టేశామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడిగా, వివాదాస్పద వ్యక్తిగా పేరు పొందారు. అయితే, ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి వార్తలు రావడం గమనార్హం. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు, ఖండించలేదు. సాధారణంగా ఇరాన్ తన అత్యున్నత నాయకుల ఆరోగ్య స్థితిగతులను అత్యంత రహస్యంగా ఉంచుతుంది. గతంలో కూడా అలీ ఖమేనీ ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చినప్పుడు ఇరాన్ నిశ్శబ్దంగానే ఉంది. ఇదే క్రమంలో వెనిజులా, ఇరాన్ తర్వాత క్యూబాపైనే అమెరికా సైన్యం దాడులు జరపనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా, ఇరాన్‌పై అమెరికా సైన్యాలు విజయం సాధించాయని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. అమెరికా సైన్యపు విజయాలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ’మా ప్రభుత్వం ఇటీవలి వారాల్లో క్యూబా నాయకత్వంలోని కొన్ని వర్గాలతో చర్చలు ప్రారంభించాం.. అమెరికా సైన్యం క్యూబాపై ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడవచ్చని ’ అని కూడా ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. కొన్నిసార్లు సైన్యాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అన్నట్టు తర్వాతి వంతు క్యూబాదే’ అని అన్నారు. ఈ మాటలు అన్నతర్వాత ట్రంప్ మరలా.. నేను అలా అనలేదని అనుకోండి అని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే సైనిక ఘర్షణను నివారించే ప్రయత్నంలో తమ దేశం అమెరికాతో చర్చలు జరుపుతోందని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ అంగీకరించారు. ఇప్పటికే అమెరికా ఆంక్షల వల్ల క్యూబాకు సరఫరా అయ్యే చమురు దిగుమతులు తగ్గాయి. దీంతో విద్యుత్ ప్లాంట్లు, రవాణాను నడపడానికి ఆధారపడే చమురు లేక క్యూబా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది.
జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఆయన భార్యని పట్టుకోవడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్‌కు ముందు.. క్యూబాకు అవసరమైన చమురులో అధిక భాగం వెనిజులా సరఫరా చేసింది. కానీ ఆ తర్వాత వాషింగ్టన్ ఒత్తిడితో కారకాస్‌లోని కొత్త ప్రభుత్వం క్యూబాకు చమురు సరఫరాలను నిలిపివేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





