ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ‘సిట్‌ ‘ దూకుడు

– ప్రభాకర్‌ ‌రావుపై విచారణ వేగవంతం
– ఆధారాలు రాబట్టే యత్నాల్లో అధికారులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణలో వేగం పెంచింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌నేతృత్వంలో సిట్‌ ‌విచారణ కొనసాగనుంది. కొత్త సిట్‌లో తొమ్మిదిమంది అధికారులు ఉన్నారు. శనివారం నుంచి కీలక విచారణను సిట్‌ అధికారులు ప్రారంభించారు. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు కస్టోడియల్‌ ‌విచారణ గడువును మరో వారం రోజులపాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఇందులో భాగంగా ఆయ‌న‌ను పోలీసులు మళ్లీ జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టనున్నారు. వారం రోజుల విచారణలో ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారానికి సంబంధించిన కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీస్‌ ‌వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు, మరికొందరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ‌పీఎస్‌లో ప్రస్తుతం ప్రభాకర్‌ ‌రావును ‘సిట్‌’ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలించేందుకు ‌ప్రభుత్వం కొత్త సిట్‌ను నియమించగా ఆ బృందంతో హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసు పురోగతి, విచారణ విధానం, సాంకేతిక అంశాలు, ఆధారాల సేకరణ వంటి పలు కీలక విషయాలపై అధికారులకు సీపీ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ఉదయం నుంచే పలువురు సిట్‌ అధికారులు జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ వారం రోజులపాటు ప్రభాకర్‌ ‌రావును నిరంతరంగా ప్రశ్నించనున్నారు. సిట్‌ ‌విచారణను సమర్థవంతంగా నిర్వహించేందుకు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ ‌కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక రూమ్‌ను కేటాయించారు. అక్కడే కస్టోడియల్‌ ‌విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులను కూడా సిట్‌ అధికారులు పిలిపించి ప్రభాకర్‌ ‌రావు ఎదుటే ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, సాంకేతిక ఆధారాలు, డేటా విశ్లేషణ ఆధారంగా ప్రభాకర్‌ ‌రావును సమగ్రంగా విచారిస్తున్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా భావిస్తున్న ప్రణీత్‌ ‌రావుతో కలిపి కూడా ప్రభాకర్‌ ‌రావును సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఆదేశాలు, అమలైన విధానం, రాజకీయ నేతలు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్‌ అం‌శాలపై స్పష్టత కోసం అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *