– అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: హుజూరాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ మాదిరిగానే తన నియోజకవర్గంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చేశారన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం కల్పించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏమిటంటూ కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించాలంటూ స్పీకర్‌ను కాంగ్రెస్ సభ్యుడు నాగరాజు కోరారు. 2023 ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకి కొన్ని నెలల ముందు రూ.లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లోని పలు పిల్లర్లు కుంగాయి. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపానికి కారణం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అంతేకాక తాము అధికారంలోకి వస్తే దీనిపై న్యాయ విచారణ చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు రెండేళ్లపాటు విచారించిన ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగడానికి బాంబుతో పేల్చడమే కారణమంటూ బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.