తెలంగాణ రెపరెపలాడాలి

– రాష్ట్రంలో మేధాశక్తికి సాటి లేదని ప్రపంచానికి చాటుదాం
– ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నియామకాలు జరగలేదు
– యువత పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం
– ఉప‌ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రం అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదు శిల్పారామంలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం 40 ఏళ్లపాటు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నియామకాలు జరిగిన దాఖలాలు లేవని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 562 మందికి ఏకకాలంలో నియామక పత్రాలు అందజేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం నిరుద్యోగ యువత ఉరికంబాలు ఎక్కిందని, అగ్నికి ఆహుతి అయ్యారని, నాడు యువత చేసిన పోరాటం, త్యాగాలను చూసి పార్లమెంట్‌లో బలం లేకున్నప్పటికీ సోనియాగాంధీ అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంపాటు ఏ ఉద్యోగాల కోసమైతే నిరుద్యోగులు పోరాటం చేశారో ఆ ఉద్యోగాల ప్రస్తావన ఆనాటి పాలకులు తీసుకురాలేదని, గ్రూప్‌ పరీక్షల నిర్వహణ గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన వారి గురించి ఆలోచించకుండా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు వారి కుటుంబం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తనతో అనేకసార్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన గురించి చర్చించారని, ఎంత ఖర్చైనా వెనకాడకుండా కమిషన్‌ ప్రక్షాళన చేసి నియామకాల కోసం ప్రభుత్వం నిధులను మంజురు చేసిందని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష మొదలుకొని ని యామక పత్రాలు అందజేసే వరకు ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేసిందన్నారు. ఈ గ్రూపు`1 పరీక్షలలో వ్యవసాయ కూలీ బిడ్డ, పంక్చర్లు చేసే కుటుంబానికి చెందిన బిడ్డ ఉన్నతాధికారులుగా నియమితులవడం తమను, తమ కేబినెట్‌ ఎంతో ఆనందానికి గురి చేస్తున్న పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ప్రజలను ఆత్మగౌరవంతో నిలబెట్టడమేనని అన్నారు. యువత మేధాశక్తిని ఉపయోగించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని మానవ వనరులను సానబెట్టి ప్రపంచానికి అందిస్తామన్నారు. విద్యతోనే ఆయా కుటుంబాలు, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భట్టి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *