– పనులు చేయని గులాబీ కాంట్రాక్టర్లను ఇంటికి పంపిస్తాం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
తొర్రూరు/వర్ధన్నపేట/స్టేషన్ ఘన్‌పూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదని, మీ ప్రాంత అభివృద్ది, మీ సంక్షేమం బాధ్యతను తాను తీసుకుంటామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఇన్‌చార్జి మంత్రిగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్, జనగామ మున్సిపాల్టీల పరిధిలో శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇండ్లు మంజూరు చేశారని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇండ్లు మంజూరు చేస్తోందని అన్నారు. రెవెన్యూ మంత్రిగా అర్హులైన పేదలకు స్ధలాలు మంజూరు చేసి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇండ్లు నిర్మించే బాధ్యత తనదేనని ప్రకటించారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కాంగ్రెస్ ప్రతినిధులే ఉన్నందున పథకాలను తామే మంజూరు చేయగలమని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చేసేదేమీ లేదని అన్నారు. గతంలో రెండుసార్లు మీరు వారికి చెంప ఛళ్లుమనేలా బుద్ది చెప్పారని, ఈసారి కూడా వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తొర్రూరు మున్సిపాల్టీ పరిధిలో రోడ్లు, కాల్వలని గులాబి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వారి చెవులు మెలేసి పనులు చేయిస్తామని లేదా వారిని ఇంటికి పంపిస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయిస్తామని చెప్పారు. కాంగ్రెస్, మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్ధులను గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు.
వర్ధన్నపేట మున్సిపాల్టీకి మంత్రి వరాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ది పథకాలను చేపడుతోందని చెప్పారు. వర్ధన్నపేట మున్సిపల్ వార్డులలో ఆయన ప్రచారం చేసి వరాల జల్లు కురిపించారు. ఈ మున్సిపాల్టీలో ప్రగతి పనుల కోసం రూ.10కోట్లను అందిస్తామన్నారు. అంతేగాక ఈ ప్రాంతీయులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన హెచ్.టి విద్యుత్ లైన్లను వచ్చే నెల మొదటి వారంలో మార్పిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో ఏర్పాటైన ఈ మున్సిపాల్టీని వారు పట్టించుకోకుండా దరిద్రాన్ని అంటించి అన్యాయం చేశారని, ఇప్పుడు మిమ్మల్ని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మున్సిపాల్టీలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కలిపేసిన అన్ని తండాలను వేరుచేసి గ్రామ పంచాయతీలుగా చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ వారు ఇక్కడ నిర్మించిన ఇండ్లు ఎన్నో చూడాలన్నారు. వచ్చే ఏప్రిల్‌లో మరో విడత ఇండ్లను తాము మంజూరు చేస్తామని, ఈమేరకు జాబితాలు తయారవుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో లంబాడీలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్టీ జాబితాలో కలిపిందని గుర్తు చేస్తూ మీ తండాలను పంచాయతీలుగా మారుస్తామంటూ కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ఎల్లమ్మ గుడిని తమ సొంత నిధులతో పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




