యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి

– అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
– ఏకగ్రీవంగా ఆమోదించిన సభ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మద్య మొదలైన యుద్దం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. క్రూడాయిల్ ఉత్పత్తి, రవాణాలపై యుద్దం ప్రభావం చూపుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు యుద్దం ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్, లెబనాన్ మీద దాడి చేస్తున్నాయని, ఇరాన్ కూడా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్‌గా చేసుకొని దాడి చేస్తున్నదని తెలిపారు. ఫైటర్ బాంబర్సు, బాలెస్టిక్ మిస్సైల్స్, డ్రోన్స్ వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయని, దీనివల్ల జరిగే విధ్వంసంలో అమాయకులు దాదాపు 4,000 మందిమరణించారని తెలిపారు. ఈ మరణాలతోపాటు, ఆర్థికపరమైన విధ్వంసం మరొక పక్కన జరుగుతున్నదన్నారు. మరణాలు అయా దేశాలకు మాత్రమే పరిమితమైతే ఆర్థిక విధ్వంసం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నదన్నారు. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలకు మరింత ప్రమాదకరంగా మారిందని, మన దేశంపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని, కనీసం ఇంతటితోనైనా ఈ యుద్దాన్ని ఆపకపోతే ప్రపంచ భవష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్దం ఇలాగే కొనసాగినా ఆపకపోయినా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చునన్నారు. ఇది ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు అని, ఇటువంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తగిన చొరవ తీసుకోవాలని సభ ద్వారా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *