18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి

– యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి
– బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండి
– 2014-15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి
– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి

దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కలిశారు. వానాకాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎలఎంటీ) అనుమతించారని, కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో అదనంగా 18 ఎలఎంటీలు తాము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్‌సీఐ సేకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌సీఐ 2014-15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయిపెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ని రేవంత్, ఉత్తమ్ కోరారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేకరణకు తాము రుణం తీసుకున్నామని, దానికి వడ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వీరి వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *