– మంత్రి శ్రీధర్‌బాబుకు టి సాట్ సిఇవో వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి1: ప్రభుత్వం చేపట్టబోయే ’నూతన విద్యా విధానం’ లో టి-సాట్ నెట్‌వర్క్ ను భాగస్వామిని చేసే విధంగా చూడాలని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కోరారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి ’నూతన విద్యావిధానంలో టి-సాట్ భాగస్వామ్యం’ పేరుతో టి-సాట్ రూపొందించిన విధి విధానాల ప్రణాళిక డాక్యుమెంట్ ను సీఈవో అందచేశారు. విద్యా శాఖకు సంబంధించి ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయిలోనూ టి-సాట్ డిజిటల్ కంటెంట్ అందిస్తోందని సీఈవో వేణుగోపాల్ రెడ్డి మంత్రికి తెలిపారు. విద్యా ఛానళ్ల ప్రసారాల్లో 39 వేల వీడియోలు కలిగి 140 మిలియన్ వ్యూస్ తో దేశంలోనే టి-సాట్ మొదటి స్థానంలో నిలిచి, తెలంగాణలోని సుమారు 80 శాతం చదువరులకు వివిధ రకాల కార్యక్రమాలతో చేరువైందని వివరించారు. ఆధునిక సమాజంలో పూర్తిగా డిజిటల్ దే విద్యా వ్యవస్థ ఆధారపడే అవకాశాలున్నందున భవిష్యత్ ను ఆలోచించి టి-సాట్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని వేణుగోపాల్ రెడ్డి మంత్రికి వివరించారు. ఇటీవలి కాలంలో ’ఆన్వల్ స్టూడెంట్ కాంపిటషన్స్-2025’ పేరుతో టి-సాట్ నిర్వహించిన పోటీలు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేయడమే అందుకు ఉదాహారణ అని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోయే నూతన విద్యా విధానంలో టి-సాట్ ను సైతం భాగస్వామిని చేస్తే డిజిటల్ కంటెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి టి-సాట్ డిజిటల్ సహకారాన్ని అందించడానికి సిద్దంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐటి శాఖ పరిధిలో ఉన్న టి-సాట్ నూతన విద్యావిధాన రూపకల్పనంలో భాగస్వామిని చేసేలా చూడాలని కోరారు. మంత్రిని కలిసిన సందర్భంగా సీఈవో వేణుగోపాల్ రెడ్డి వెంట టి-సాట్ ఎగ్జుక్యూటీవ్ డైరెక్టర్ ఎండీ సాదిక్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




