– రెండేళ్లలోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
– సర్పంచ్‌ల సన్మానంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్
మహబూబ్‌నగర్,ప్రజాతంత్ర,డిసెంబర్ 17: రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సన్మానించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి, రెండు మించి సర్పంచ్ స్థానాలను గెలవ లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులకు సింబల్ ఉంటే అధిక స్థానాలు కైవసం చేసుకునే వాళ్లమని చెప్పారు. గ్రామాలకు వచ్చే నిధులు ఎవ్వరు ఆపలేరని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యే సరికి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారన్నారు. ఎమ్మెల్యేలు చెప్పే మాటలు అబద్ధమని పేర్కొన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు గెలుపొందిన గ్రామాలకు నిధులు ఇవ్వకుండా ఆ ఊర్లోకి ఎమ్మెల్యేలు అడుగుపెట్టగలరా అంటూ ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్ సత్తా చాటాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ జిల్లాకు రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే లేదంటూ పెదవి విరిచారు. మన జిల్లాకు అన్నం పెట్టే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును నిలిపేశావరంటూ రేవంత్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సన్మాన సభకు భారీ ఎత్తున కేడర్ రావడం బట్టి చూస్తే బీఆర్‌ఎస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుందనడానికి ఇదే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరావు తెలిపారు. గెలుపొందిన వార్డు మెంబర్లు, సర్పంచ్‌లకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి పాలైన అభ్యర్థులు ఎవ్వరూ బాధపడ వద్దంటూ సూచించారు. తాను ముఖ్యమంత్రి అవుతానంటే.. జిల్లాలోని మొత్తం 12 స్థానాలను నుంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు.. కానీ ఈ జిల్లాకు సీఎం రేవంత్ చేసిందే లేదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పని చేసినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయాల్సి ఉందంటూ కేడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేద్దామని ఆయన సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.