– అపార్టుమెంట్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద త్వరలో ఇండ్ల మంజూరుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు అపార్టుమెంట్ తరహాలో ఇండ్లను అందించేలా త్వరలో తీపి కబురు చెబుతామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో గల రసూల్‌పురలో 344 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సహచర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గణేష్ తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 70 గజాలున్నాసరే స్ధానికంగా నివసించే వారికి అపార్టుమెంట్ తరహాలో ఇండ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో తాను ఈ ప్రాంతంలో మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తిచేసి ఇస్తానని మాట ఇచ్చానని, దాన్ని నెరవేర్చామని తెలిపారు. నాటి ప్రభుత్వంలో దొరవారు పేదలకు ఇండ్లు కడితే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించారని, ఆనాడు ఏడాదికి లక్ష ఇండ్లు కట్టినా పదేళ్లలో పదిలక్షల ఇండ్లు పేదలకు వచ్చేవని అన్నారు. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా తొలివిడతగా 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. మరో మూడు విడతల్లో కూడా మంజూరు చేస్తామని, దీనిలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. స్ధానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గణేష్‌లు ప్రస్తావించిన అంశాల మేరకు వాజ్‌పేయి కాలనీలో మొండి గోడలతో ఉండిపోయిన ఇండ్లను పూర్తిచేసి లబ్దిదారులకు ఇచ్చేలా మంత్రి సభాముఖంగా అధికారులను ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మరమ్మతులు చేసి నెల రోజులలోగా పేదలకు కానుకగా అందిస్తామని వెల్లడిరచారు. కంటోన్మెంట్ పరిధిలోని పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తాతముత్తాతల నుంచి నివసిస్తున్నవారి భూములను ఫ్రీహోల్డ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున తగు సాయాన్ని అందిస్తామని, దీనికోసం ఎంపీ రాజేందర్ కేంద్ర ప్రభుత్వం నుంచి తగు ఆదేశాలు తేవాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఈ ప్రాంతంలో సౌకర్యాలతో కూడిన శ్మశానవాటికను నిర్మిస్తామని, ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల సాధించాలని కూడా ఎంపీ ఈటలకు సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి గతంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. పేదల గృహ ప్రవేశాలలో పాల్గొంటున్నందుకు తన జన్మ ధన్యమైందని మంత్రి పొంగులేటి అన్నారు. అనంతరం పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





