- కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
- హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31 : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీకి ప్రజలు అందించిన మద్దతుతో మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ మెరుగైన భాగస్వామ్యం పొందింది. రాష్ట్రంలో పోలయిన మొత్తం వోట్లలో 77,43,947 వోట్లను సొంతం చేసుకున్న బీజేపీ, 36 శాతం వోట్లతో తెలంగాణవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపింది.
అంతేకాదు, బీజేపీని తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ కిషన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నరేంద్రమోదీ సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యాలకు తోడు రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, బాధితులకు భరోసానిస్తూ, బీజేపీ ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుందన్నారు. బీజేపీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు 2025 లోనూ కొనసాగుతాయని ఆకాంక్షించారు. 2025లో ప్రజలందరికీ మంచి చేకూరాలని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.





