– బావమరిదికి ఫోన్ చేసి మరీ భార్యను చంపాడు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి30: దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27)ని ఆమె భర్త అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపాడు. మృతురాలి సోదరుడు నిఖిల్ మీడియాతో మాట్లాడుతూహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘హత్యకు ముందు నా సోదరి కాల్ చేసి తన భర్త వేధిస్తున్నట్లు చెప్పింది. అదే సమయంలో అక్కడే ఉన్న అంకుర్ ఆమె నుంచి ఫోన్ లాక్కొని రికార్డు చేసి పెట్టుకో.. పోలీసులకు ఆధారంగా పనికొస్తాయి. మీ అక్కను చంపుతున్నా అని బెదిరించాడు. ఆ సమయంలో అతడిని ఎంత సముదాయించడానికి ప్రయత్నించినప్పటికీ నా మాటలు వినలేదు. కొంతసేపటి తర్వాత అంకుర్ కాల్ చేసి కాజల్ చనిపోయిందని.. గజియాబాద్ ఆస్పత్రికి వచ్చి చూసుకొమ్మని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి వెళ్లగా గర్భిణి అయిన నా సోదరి మృతిచెంది ఉందని నిఖిల్ బావురుమన్నాడు. 2023లో అంకుర్‌తో కాజల్ వివాహం అయిన సమయంలో పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చామని, అయినా అత్తింటివారు అదనపు కట్నం కోసం తన కుమార్తెను వేధించేవారని మృతురాలి తల్లి ఆరోపించింది. రక్షణ శాఖలో క్లర్కుగా పనిచేస్తున్న అంకుర్‌కు ఆర్థికపరమైన అంశాల్లో భార్య కాజల్‌తో తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 22న దంపతుల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో విచక్షణ కోల్పోయిన అంకుర్ ఆమెపై దాడి చేసి డంబెల్‌తో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాజల్ గజియాబాద్ ఆసుపత్రిలో అయిదు రోజులు మృత్యువుతో పోరాడి మంగళవారం మృతిచెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంకుర్‌ను అరెస్టు చేసిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్`అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది. పెళ్లిలో బుల్లెట్ బైక్, బంగారం ఇచ్చినప్పటికీ కారు ఇవ్వలేదని అతను తరచూ కాజల్‌ను వేధించేవాడని తెలుస్తోంది. ముందుగా హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కాజల్ మృతితో దానిని హత్య కేసుగా మార్చారు. వీరికి ఇప్పటికే ఒకటిన్నర ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





