– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సికింద్రాబాద్ లో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ప్రజలకు బీజేపీ తెలంగాణ శౄఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, అన్ని వర్గాల యువత స్వామి వివేకానందకు నివాళులర్పించి, ఆయన ఆదర్శాలు, బోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకోవాలని సూచించారు. 164 సంవత్సరాలు గడిచినా స్వామి వివేకానంద బోధనలు నేటికీ అనుసరణీయమేనన్నారు. ప్రసంగాలు, ఆదర్శాలు, చైతన్యం, సద్గుణాలు ఇప్పటికీ జాతీయ అవగాహన పట్ల ప్రేరణనిస్తునే ఉన్నాయి. యుద్ధాలు, సంఘర్షణలు, అస్థిరతతో నిండిన నేటి ప్రపంచంలో వివేకానంద బోధించిన శాంతి, ప్రపంచ సామరస్యం సందేశం మరింత అవసరం అన్నారు. ప్రపంచ అశాంతికి శాశ్వత పరిష్కారం శాంతి మార్గమేనని వివేకానంద స్పష్టంగా చూపారని చెప్పారు. ఆధ్యాత్మిక శక్తి, సామరస్యం, సార్వత్రిక సోదరభావంపై ఆధారపడిన వివేకానందతత్వం నేటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. లేచి నిలబడండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగకండి అనే వివేకానంద ప్రసిద్ధ నినాదం నేటి యువతకు మార్గదర్శక సూత్రంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం జరిగిన ప్రదేశానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని, చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో చారిత్రక ప్రసంగం చేయడానికి ముందు వివేకానంద ఈ ప్రాంతంలోనే ఒక రాత్రి బస చేశారని పేర్కొన్నారు. మహబూబ్ కాలేజీలో ప్రసంగం అనంతరం ఈ వీధిలోని ఒక భక్తుని నివాసంలో స్వామిజీ విశ్రాంతి తీసుకున్నారని, అందువల్ల ఈ ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
అస్మిత యోగాసన జోనల్ లీగ్
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన అస్మిత యోగాసన జోనల్ లీగ్ 2025–26 (ఖేలో ఇండియా), సౌత్ జోన్ కార్యక్రమంలో రా\మచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న యువతను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.





