బొగ్గు రంగంలో సుస్థిర‌త సాధించాలి

– మ‌రింత అభివృద్ధి దిశ‌గా దూసుకెళ్ల‌నున్న‌ భార‌త్‌
– కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి

న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 17ః అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన భద్రతలో బొగ్గు రంగం చాలా ముఖ్యంగా మారింద‌ని, పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఈ రంగంలో సుస్థిరత సాధించాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్‌రెడ్డి అన్నారు. దిల్లీలో బుధ‌వారం జరిగిన ఫ్యూచర్ కోల్- ఇండియా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. రాబోయే దశాబ్దంలో భారత్ మరింత అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ వృద్ధిలో బొగ్గు వాటా తగ్గినా డిమాండ్ మాత్రం అనేక రెట్లు పెరుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. నేటికీ భారతదేశంలో 55 శాతానికి పైగా ప్రైమరీ ఎనర్జీ బొగ్గు నుంచే వస్తోందని, దాదాపు 75 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపై ఆధారపడి జరుగుతోందని తెలిపారు. అందుకే దేశీయ బొగ్గు ఉత్పత్తి భారత్‌కు ఎంతో అవసరమ‌న్నారు. గత పదేళ్లుగా అమలు చేసిన సంస్కరణల ఫలితంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి దిశగా బొగ్గు రంగం వేగంగా ముందుకెళ్తోంద‌ని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఈ రంగంలో పారదర్శకత పెరిగి నమ్మకానికి మారుపేరుగా మారింద‌ని, దీంతో బొగ్గు ఉత్పత్తి 565 మిలియన్ టన్నుల నుంచి 1 బిలియన్ టన్నులకుపైగా పెరిగింద‌ని వివ‌రించారు. తొలిసారిగా బొగ్గు నిల్వలు 50 మిలియన్ టన్నులను దాటాయ‌ని, దిగుమతులు 26 శాతం నుంచి సుమారు 19 శాతానికి తగ్గాయ‌ని వెల్ల‌డించారు. బొగ్గు రంగంలో తీసుకొచ్చిన వేలం ప్రక్రియ దేశంలోనే అతిపెద్ద సంస్కరణ అని, దీని ద్వారా ఇప్పటివరకు 136 గనులకు విజయవంతంగా వేలం వేయ‌డంతో రాష్ట్రాలకు రూ.43,330 కోట్ల ఆదాయం వచ్చింద‌ని చెప్పారు. 4 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయ‌ని, బొగ్గు రంగం ఆధునికీకరణలో సరకు రవాణా కీలక పాత్ర పోషిస్తోంద‌ని,. అందుకే దీన్ని మెకనైజ్‌డ్ గా మార్చామ‌ని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామ‌ని, దీంతో వ్యాగన్ లోడింగ్ మూడున్నర గంటల నుంచి గంటకు తగ్గింద‌ని అన్నారు. కోల్ శక్తి వంటి కార్యక్రమాలు, ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్లు, కోల్ ఇండెక్స్ ఆధారిత ట్రేడింగ్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈ రంగం సమర్థంగా ముందుకు వెళ్తోంద‌ని కిష‌న్‌రెడ్డి చెప్పారు. దేశ ఇంధన భద్రత, క్లైమెట్ కమిట్‌మెంట్ మధ్య సమతుల్యత సాధించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ మంచి పరిష్కారమ‌న్నారు. గ్యాసిఫికేషన్ ద్వారా ఎరువులు, రసాయనాలు, మిథనాల్, హైడ్రోజన్, సింథటిక్ గ్యాస్ వంటి వాటిని ఉత్పత్తి చేయొచ్చున‌న్నారు. దీంతో ఆయా రసాయనాల దిగుమతులు తగ్గి, దేశీయ పరిశ్రమలు బలోపేతం అవుతాయ‌ని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింద‌ని, అంతేకాక ఇందులో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. మూతపడ్డ గనుల వద్ద పర్యావరణ పునరుద్ధరణకు కేంద్ర బొగ్గు శాఖ అనేక చర్యలు చేపట్టిందిని, ‘మిషన్ గ్రీన్’ కింద 2030 నాటికి 74 వేల హెక్టార్లలో పచ్చదనాన్ని పెంచాలనేది లక్ష్యమ‌ని, రెన్యూవబుల్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో పూర్తి నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామ‌ని, 2047 నాటికి దేశం వికసిత భారత్ గా మారనున్న నేపథ్యంలో ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని మంత్రి కిష‌న్‌రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *