surveillance on canals, ponds: ఆనకట్టలు కాల్వలు, చెరువులపై నిఘా పెంచాలి

– అన్ని విభాగాల్లో సెలవులు రద్దు
– విపత్తు సూచనలుంటే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాలి
– క్షేత్రస్తాయిలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహించాలి
– నీటిపారుదల శాఖాధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతోపాటు చెరువుల భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిఘా పెంచాలని ఆయన సూచించారు. విపత్తులు సంభవించే సూచనలు ఉంటే అధికార యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు సహా అన్ని విభాగాల అధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాలతో ఎలాంటి నష్టాలు కలగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సన్నద్ధం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితితులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎలాంటి సందర్భం ఎదురైనా తక్షణ నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుగా సిద్ధం కావాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌, ఈఎన్‌సీ అంజద్‌ హుస్సేన్‌లతోపాటు ఆయా జిల్లాల సీఈలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *