Suravaram funerals: గొప్ప నాయ‌కుడిని కోల్పోయాం: రేవంత్ రెడ్డి

– అధికార లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు
– ఆదేశాలు జారీ చేసిన ముఖ్య‌మంత్రి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప నాయకుడని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని ముఖ్యమంత్రి అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈమేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈయన  స్వ‌గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రజల సందర్శనార్థం మఖ్దుం భవన్‌కు పార్థివ దేహం

సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం 24వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటలకు వరకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ఉంచుతారని పార్టీ రాష్ట్ర శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి ఆయన పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్‌ కాలేజికి అప్పగించనున్నట్లు, నేత్రాలను ఎల్వీ ప్రసాద్‌ నేత్రాలయానికి దానం చేయనున్నట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *