– ఆయన ఆశయాల సాధనకు కృషి
– సురవరం సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్30: పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. రవీంధ్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరయి మాట్లాడారు. మొదటితరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు పాలమూరు జిల్లాకు వన్నెతెచ్చారు. రెండో తరంలో జైపాల్‌రెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డి వంటివారు రాజకీయాల్లో రాణించారు. జైపాల్‌రెడ్డి దక్షిణ భారత్ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన యువ ఎంపీగా ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు. అదే కోవలో సురవరం సుధాకర్‌రెడ్డి కూడా గుర్తింపు తెచ్చుకున్ననేత అన్నారు. సిపిఐ కార్యార్శిగా, ఎంపిగా ఆయన చిరస్మరణీయ సేవలు అందించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం. ప్రజలకు సురవరం సుధాకర్‌రెడ్డి ఎప్పుడూ గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.రాజకీయం అంటేనే అధికారం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉంటాం కానీ, ప్రతిపక్షంగా ఉండలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు కొందరు ఇష్టపడట్లేదని పరోక్షంగా బిఆర్‌ఎస్‌పై విసుర్లు విసిరారు. కమ్యూనిస్టులు మాత్రం ఎన్నేళ్లు అయినా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారు. ప్రజల తరఫున మాట్లాడటం, పోరాడటం పెద్ద బాధ్యత. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడేందుకు నేతలు ముందుకు రావట్లేదు. సమస్యలపై పోరాడి.. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను దించడంలో కమ్యూనిస్టులు ముందున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా కమ్యూనిస్టులే కారణమనేది తన నమ్మకమని సిఎం అన్నారు. రవీంధ్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు రేవంత్ హాజరయ్యారు . సురవరం చిత్రపటానికి నివాళి అర్పించారు. కమ్యునిస్టులంటేనే ప్రతిపక్షమని అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం,ఆలోచన ఇంకా పెరగాలన్నారు. కమ్యునిజం అంటే లైబ్రరీలో దొరికే పుస్తకం కాదని. కమ్యూనిస్టులంటేనే ప్రజల కోసం కొట్లాడే వాళ్లని అన్నారు. కమ్యూనిస్టులంటే ప్రజలకు ఓ భరోసా,నమ్మకం ఉందన్నారు. సురవరం ఉంటే ఓట్ చోరీపై మరింతగా పోరాడే వారరన్నారు. మహారాష్ట్రలో నాలుగు నెలల్లో కొత్తగా కోటి మంది ఓటర్లు పుట్టుకొచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్. బీహార్ లో 65 లక్షల కొత్త వోట్లు వొచ్చాయని చెప్పారు. వోట్ల తొలగింపుతో ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సురవరం చివరి శ్వాస వరకు సీపీఐతోనే ఉన్నారని.. 65 సంవత్సరాల పాటు ఎర్రజెండా నీడనే ఉన్నారని కొనియాడారు రేవంత్. సురవరం సామాజిక చైతన్యం ఉన్నవారన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి సూచనతోనే తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నారాయణ, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీపీఎం నేత బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, గుమ్మడి నర్సయ్య, ప్రొ.హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





