ఎయిడ్స్ నివార‌ణ‌పై ‘న్యాకో’ ప్ర‌త్యేక దృష్టి

– ‘మిషన్ ఎయిడ్స్ సురక్ష’ కింద ప్రత్యేక కార్యక్రమాలు
– హైదరాబాద్ లో సురక్ష సంకల్ప్ కార్యశాల
– జిల్లాల నుంచి హాజరైన అధికారులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: కేంద్ర‌ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ‌(న్యాకో) హైదరాబాద్‌లో సురక్ష సంకల్ప్ కార్యశాలను బుధ‌వారం నిర్వహించింది. జాతీయ కార్య‌క్ర‌మ‌మైన ‘మిషన్ ఎయిడ్స్ సురక్ష’ కింద జిల్లాస్థాయిలో హెచ్‌ఐవీ నివార‌ణ చ‌ర్య‌ల‌ను బలోపేతం చేయడానికి ఈ కార్య‌శాల ఏర్పాటు చేసింది. ఎయిడ్స్ నివార‌ణ‌కు సంబంధించి రాష్ట్రంలోని ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో లక్షిత కార్య‌క్ర‌మాల‌ను వేగవంతం చేయడానికి ఈ కార్యశాల జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల‌ను ఒక‌చోట‌కు చేర్చింది. ఈ వర్క్‌షాప్‌కు న్యాకో డైరెక్టర్ జనరల్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి డాక్టర్ రాకేష్ గుప్తా అధ్యక్షత వహించారు. తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్, రాష్ట్ర ఎయిడ్స్ నివార‌ణ సంస్థ‌(టీఎస్ఏసీఎస్‌) ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ ఇందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ రాకేష్ గుప్తా మాట్లాడుతూ భారత దేశ హెచ్‌ఐవీ నివార‌ణ చ‌ర్య‌ల‌కు ప్రాధాన్య జిల్లాలు కేంద్ర బిందువుగా ఉన్నాయి. హెచ్ఐవీ నివార‌ణ దిశ‌గా ఫలితాలను మెరుగుపరచడానికి, జాతీయ లక్ష్యాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో కేంద్రీకృత, డేటా-ఆధారిత కార్య‌క్ర‌మాలు కీలకం అని పేర్కొన్నారు. మిష‌న్ ఎయిడ్స్ సుర‌క్ష‌ కార్యక్రమాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డానికి జిల్లా స్థాయిలో ప్రణాళిక, పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ‌లోని వయోజనుల్లో హెచ్‌ఐవీ ప్రాబల్యం 0.41% ఉండ‌టం, రాష్ట్రంలో సుమారు 1,56,961 మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్న నేప‌థ్యంలో జాతీయ హెచ్‌ఐవీ నివార‌ణ‌లో తెలంగాణ కీలకమైన రాష్ట్రంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో విస్తృతంగా మిష‌న్ ఎయిడ్స్ సుర‌క్ష కార్యక్రమ అమలు, పర్యవేక్షణ కోసం 19 జిల్లాల‌ను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ ప్రోగ్రామ్ అధికారులు, అదనపు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్య అధికారులు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్య‌ జిల్లాలుగా గుర్తించిన‌ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సిద్ధిపేట, మెదక్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, జనగాం, వికారాబాద్, కామారెడ్డి, హన్మకొండ, సంగారెడ్డి, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రతినిధులు ఈ వ‌ర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ కార్యశాల సందర్భంగా జిల్లా బృందాలు మిష‌న్ ఎయిడ్స్ సుర‌క్ష కార్యక్రమ పురోగ‌తిపై నివేదిక‌న స‌మ‌ర్పించాయి. కార్యాచరణ, క్షేత్రస్థాయి సవాళ్లను చ‌ర్చించాయి. జిల్లావారీగా డేటా-ఆధారిత కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి నిర్మాణాత్మక చర్చలు జ‌రిపాయి. హెచ్‌ఐవీ నివారణ వ్యూహాలను బలోపేతం చేయడం, నిర్ధార‌ణ పరీక్ష సేవలను విస్తరించడం, యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్‌టీ) అనుసంధానం, చికిత్స‌ కొనసాగింపును మెరుగుపరచడం, వైరల్ లోడ్ అణచివేతను పెంచడం, ముప్పు అధికంగా ఉన్న‌ జనాభాలో లక్షిత కార్య‌క్ర‌మాల‌ను పెంచడంపై ప్ర‌ధాన దృష్టితో ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ వేదిక జాతీయ, రాష్ట్ర, జిల్లా భాగస్వాముల మధ్య సహకారానికి, సమస్యల‌ పరిష్కారానికి, అనుభవాలను పంచుకోవడానికి, సమన్వయానికి వీలు కల్పించింది, తద్వారా మరింత సమన్వయంతో కూడిన హెచ్‌ఐవీ నివార‌ణ చ‌ర్య‌ల‌కు దోహ‌ద‌ప‌డ‌నుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *