– స్పీకర్‌కు ధర్మాసనం ఆదేశాలు
– గతంలోని డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత
– సుప్రీం కోర్టు కీలక తీర్పు
న్యూదిల్లీ, జులై 31: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో తప్పు చేసిందంటూ ఆ బెంచ్ తీర్పును కొట్టివేసింది. స్పీకర్ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు.. కావున ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతమున్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరముందని, ఇలాంటి చర్యలు ఏళ్లతరబడి సాగడం మంచిదికాదని పేర్కొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరమన్నది. ’ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపుదారులపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న బీఆర్‌ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటు చట్టం తీసుకురావాల్సి ఉంటుందని అభిప్రాయపడిరది. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని బీఆర్‌ఎస్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, జి.జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు వేర్వేరుగా సుప్రీంలో ఈఏడాది జనవరి 15న పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై తొమ్మిదిసార్లు విచారణ జరగగా జస్టిస్ బీఆర్‌గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీప్‌ాలతో కూడిన ధర్మాసం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసి నేడు తుది తీరుప్రను వెలువరించింది. ప్రతివాదులుగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్, ఎ.గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లు ఉన్నారు.





