సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

– వామన్‌రావు హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
– ఇప్పటికైనా అడ్వొకేట్స్‌ రక్షణ చట్టం తేవాలి
– రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విజ్ఞప్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: అడ్వొకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞ్షప్తి చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ తీసుకురావాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై ప్రజలలో పెరుగుతున్న అవిశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. ప్రజలు ఆశించినట్లుగానే ఈ దారుణ హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, న్యాయం పట్ల నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నదన్నారు. వామన్‌ రావు-నాగమణి దంపతులపై జరిగిన ఈ క్రూరమైన హత్య రాష్ట్రంలో న్యాయవాదుల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమవుతాయన్న భయం, సాక్ష్యాలను మాయం చేయడం, ఒత్తిళ్లతో కేసును బలహీనపరచే ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయని, సీబీఐ విచారణ నిజానిజాలను వెలికితీసి దోషులకు చట్టపరమైన కఠిన శిక్షలు విధించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలవాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా న్యాయం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒక మైలురాయి అవుతుందని విశ్వసిస్తున్నామన్నారు. గతంలో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్‌ చేశానని రామచందర్‌రావు తెలిపారు. కానీ అప్పటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని ఆయన కోరారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నానన్నారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు ఆగాలంటే ఈ చట్టం తప్పనిసరిగా అమల్లోకి రావాలన్నారు. న్యాయం జరిగే వరకు, న్యాయవాదుల గౌరవం, భద్రత కోసం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *